‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ను ప్రారంభించండి.. సూపర్ రిచ్ కుటుంబాలకు ప్రధాని మోడీ పిలుపు

by Vinod kumar |
‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ను ప్రారంభించండి.. సూపర్ రిచ్ కుటుంబాలకు ప్రధాని మోడీ పిలుపు
X

డెహ్రాడూన్ : ఫారిన్‌లో పెళ్లి వేడుకలు చేసుకుంటున్న అత్యంత సంపన్న కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశ్నలు సంధించారు. భారత్‌లో ఒక్కసారైనా డెస్టినేషన్‌ వెడ్డింగ్ చేశారా అని ప్రశ్నించారు. ‘మేకిన్‌ ఇండియా’ తరహాలో దేశంలో ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’‌ను ప్రారంభించాలని వారికి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉత్తరాఖండ్‌‌లోని డెహ్రాడూన్‌లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ ఈ కామెంట్స్ చేశారు. ‘‘పెళ్లి చేసుకునే జంటలను దేవుడు కలుపుతాడని భారతీయులు విశ్వసిస్తారు. దేవుడు కలిపే జంటలు తమ జీవితంలో నూతన ప్రయాణమైన పెళ్లిని విదేశాలకు వెళ్లి ఎందుకు ప్రారంభిస్తున్నాయి? ఇప్పటికైనా యువ జంటలు డెస్టినేషన్‌ వెడ్డింగ్ గురించి ఆలోచించాలి’’ అని మోడీ సూచించారు.

‘‘ప్రతి సంపన్న కుటుంబం నుంచి కనీసం ఒక వివాహం ఉత్తరాఖండ్‌లో జరిగితే ఈ దేవభూమి డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్‌గా మారిపోతుంది. ఏడాదిలో ఐదు వేల డెస్టినేషన్ వెడ్డింగ్‌లు జరిగితే రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు వాటంతటవే మెరుగవుతాయి. ఇదే తరహాలో దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో వివాహాలు జరిగితే ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంది’’ అని ప్రధాని అభిప్రాయపడ్డారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, మూడోసారి ప్రధాని పదవిని చేపడతానని మోడీ ధీమా వ్యక్తం చేశారు. తాను మూడోసారి ప్రధాని పదవిని చేపట్టాక.. భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ప్రధాని మోడీ చెప్పారు.



Next Story

Most Viewed