వియన్నాలో మోడీకి ఘన స్వాగతం.. వందేమాతరం ట్యూన్ వినిపించి..

by Shamantha N |
వియన్నాలో మోడీకి ఘన స్వాగతం.. వందేమాతరం ట్యూన్ వినిపించి..
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. రష్యా పర్యటను ముగించుకున్న ఆయన.. ఆస్ట్రియా చేరుకున్నారు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో పర్యటించిన వ్యక్తిగా మోడీ రికార్డు సృష్టించారు. గతంలో ఇందిరాగాంధీ ఆస్ట్రియాలో పర్యటించారు. కాగా.. వియన్నా ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోడీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఆ తర్వాత హోటల్ కు చేరుకున్న మోడీ.. అక్కడి భారతీయులను కలుసుకున్నారు. హోటల్‌లో ప్రధాని మోడీకి వందేమాతరం ట్యూన్ వినిపించి స్వాగతం పలికారు. ఈ ట్యూన్ తో వియన్నా ప్రతిధ్వనించింది. ఆ తర్వాత ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహ్మర్ తో విందులో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఇరునేతల మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెతో కూడా ప్రధాని మోడీ భేటీ కానున్నారు.

పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న మోడీ

వియన్నాలో పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఆస్ట్రియాలో నివసిస్తున్న భారతీయులతో కూడా ఆయన సంభాషించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు ఆస్ట్రేలియా ప్రతినిధులతో, 3 గంటలకు సీఈవోలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీ ఆస్ట్రియా ఛాన్సలర్‌తో కలిసి భోజనం చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు అధ్యక్షుడితో భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంతో భారత్-ఆస్ట్రియా స్టార్టప్ బ్రిడ్జ్ మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది.

Next Story

Most Viewed