ప్రాణాలు తీసిన నిరుద్యోగం, రుణభారం.. 25 వేల మందికిపైగా ఆత్మహత్య

by Web Desk |
ప్రాణాలు తీసిన నిరుద్యోగం, రుణభారం.. 25 వేల మందికిపైగా ఆత్మహత్య
X

న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది. కరోనా మహమ్మారితో ఇది మరింత పెరిగింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడంతో అనేకమంది యువత మానసిక వేదనకు గురై, బలవన్మరణాలకు పాల్పడుతోంది. దేశంలో 2018 నుంచి 2020 మధ్య నిరుద్యోగం, రుణభారం కారణంగా ఏకంగా 25 వేల మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా బుధవారం వెల్లడించింది. కేంద్ర బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఎగువ సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ వ్యవహారాల మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానమిచ్చారు.

నిరుద్యోగం, అప్పుల బాధతో దేశవ్యాప్తంగా రెండేళ్లలో 25 వేల మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. వీరిలో 9,140 మంది నిరుద్యోగం కారణంతో చనిపోగా, 16,091మంది రుణ భారం తో బలవన్మరణానికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. 'నేషనల్ క్రైం రికార్డు బ్యూరో'(ఎన్సీఆర్బీ) ప్రకారం, దేశంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఏటా పెరుగుతున్నాయి. 2018లో 2,741 మంది ఆత్మహత్య చేసుకోగా, 2019లో 2,851మంది, 2020లో ఏకంగా 9,140మంది సూసైడ్ చేసుకున్నారు.

Next Story

Most Viewed