జాతీయ స్థాయిలో ఏకం కానున్న ప్రతిపక్షాలు

by Dishaweb |
జాతీయ స్థాయిలో ఏకం కానున్న ప్రతిపక్షాలు
X

కోల్‌కతా: కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ జాతీయ స్థాయిలో ఏకం కానున్నాయని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్ ఏకైక ఎమ్మెల్యే టీఎంసీలో చేరిన మరుసటి రోజు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్యెల్యే ఫిరాయింపు స్థానిక సమస్య అని ఆమె అన్నారు. ‘జాతీయ స్థాయిలో మేమంతా కలిసే ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో ఆయా పార్టీలకు సొంత బాధ్యతలు ఉంటాయన్న విషయాన్ని అన్ని పార్టీలు అర్థం చేసుకోవాలి’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిస్వాస్ టీఎంసీలోకి ఫిరాయించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా మమత చెప్పారు. ఈ ఏడాది మార్చి 2వ తేదీన బిస్వాస్ టీఎంసీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల ఐక్యతను బలోపేతం చేయడానికి ఇటువంటి పనులు చేయకూడదని బిస్వాస్ ఫిరాయింపును దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ఇటువంటి పనులు బీజేపీ లక్ష్యాలను నెరవేరుస్తాయన్నారు.

‘కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడు నెలల తర్వాత బిస్వాస్‌కు టీఎంసీ ఎర వేసింది. ఇది సాగర్దిగి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల నిర్ణయానికి పూర్తి వ్యతిరేకం. గతంలో గోవా, మేఘాలయ, త్రిపుర తదితర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఫిరాయింపుటు జరిగాయి. అప్పుడు కూడా ప్రతిపక్షాల ఐక్యతను బలోపేతం చేసేందుకు జరగలేదు. బీజేపీ లక్ష్యాలకు మాత్రమే అవి ఉపయోగపడ్డాయి’ అని రమేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆయన విమర్శలను మమత తక్కువ చేసేందుకు ప్రయత్నించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూనే.. తాము అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో కాకుండా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెడతామని చెప్పారు. ఏది ఏమైనా ప్రతిపక్షాలన్నీ కలిసి ఉండాలని ఆమె కోరారు. జూన్ 12వ తేదీన పాట్నాలో జరిగే ప్రతిపక్షాల సమావేశంలో పాల్గొంటానని ఆమె అన్నారు.


Next Story

Most Viewed