‘వన్ నేషన్ వన్ ఎలక్షన్‌’ ప్రజాస్వామ్యానికి ప్రమాదం: ఆప్

by Dishanational2 |
‘వన్ నేషన్ వన్ ఎలక్షన్‌’ ప్రజాస్వామ్యానికి ప్రమాదం: ఆప్
X

దిశ, నేషనల్ బ్యూరో: వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆప్ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా పోల్ ప్యానెల్ కార్యదర్శి నితెన్‌కు శనివారం లేఖ రాశారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే ఆలోచనను ఆప్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం, దేశంలోని సమాఖ్య రాజకీయాల ఆలోచనను దెబ్బతీస్తుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ హంగ్ శాసనసభలను ఎదుర్కోలేదు. అంతేగాక ఫిరాయింపుల నిరోధం, ఎమ్మెల్యేలు, ఎంపీల బహిరంగ కొనుగోలు అమ్మకాలను ప్రోత్సహిస్తుంది’ అని తెలిపారు.‘ముఖ్యమైన మినహాయింపులు ఉన్నప్పటికీ, రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ రెండింటికి ఒకేసారి లేదా ఆరు నెలల వ్యవధిలో ఎన్నికలు జరిగినప్పుడు చాలా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఒకే పార్టీకి ఓటు వేస్తారని ఆధారాలు సూచిస్తున్నాయి. దీంతో జాతీయ పార్టీలకు అన్యాయం జరుగుతుంది. ఆధిపత్య ప్రాంతీయ పార్టీలు కూడా ఈ పద్ధతి నుంచి లాభపడుతుండగా, చిన్న ప్రాంతీయ పార్టీలు దాని భారాన్ని భరిస్తాయి’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా, దేశంలో ఒకే సారి ఎన్నికలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేతృత్వంలో గతేడాది కేంద్రం ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Next Story