అదానీ వ్యవహారం మరువక ముందే మరో సంచలన కథనం!

by GSrikanth |
అదానీ వ్యవహారం మరువక ముందే మరో సంచలన కథనం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాలను కుదిపేస్తున్న అదానీ వ్యవహారం ముగియకముందే కేంద్రంలోని బీజేపీపై కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలకు దిగింది. భారత దేశ ఎన్నికలను ‌ఇజ్రాయేల్‌కు చెందిన ఓ రహస్య టీమ్ ప్రభావితం చేస్తోందన్న అంతర్జాతీయ మీడియా కథనాలపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇజ్రాయేల్ సంస్థలతో ప్రధాని మోడీ చేతులు కలిపి దేశంలోని ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని దీనిపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నేతలు సుప్రియ శ్రీనతే, పవన్ ఖేడాలు గురువారం డిమాండ్ చేశారు. విదేశాలతో చేతులు కలిపి 2024 ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నారని, ఏజెన్సీలతో ఇక్కడ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ చర్యల వల్ల భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఫైర్ అయ్యారు.

అంతర్జాతీయ మీడియ కథనం దుమారం:

భారత్‌తో సహా మొత్తం 20 దేశాల ఎన్నికలను ఇజ్రాయేల్‌కు చెందిన ఓ రహస్య టీమ్ ప్రభావితం చేస్తందని 'ది గార్డియన్‌ న్యూస్' కథనం పేర్కొంది. ప్రజాస్వామ్యాలను అస్థిర పరచడం, ఎన్నికలను ప్రభావితం చేసేలా తప్పుడు కథనాలను పెద్దఎత్తున ప్రచారం చేయడం ఈ ఎజెన్సీ ప్రధాన లక్ష్యం అని ఈ నివేదిక స్పష్టం చేసింది. ముగ్గురు రిపోర్టర్లు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ వల్ల ఈ విషయం బహిర్గతం అయినట్లు 'ది గార్డియన్ న్యూస్' పేర్కొంది. 'టీమ్ జార్జ్' అనే కోడ్ పేరుతో ఇజ్రాయేల్‌కు చెందిన ఓ బృందం దీన్ని అత్యంత రహస్యంగా నిర్వహిస్తోందని వెల్లడించింది. కాబోయే క్లయింట్‌లుగా నటిస్తూ రిపోర్టర్లు 'టీమ్ జార్ట్'ను సంప్రదించగా వీరి బండారం అంతా బయటకు వచ్చిందని పేర్కొంది. ఈ "టీమ్ జార్జ్"కు 50 ఏళ్ల తాల్ హనాన్ నాయకత్వం వహిస్తున్నాడని ఇతను ఇజ్రాయేల్ ప్రత్యేక దళాలకు చెందిన మాజీ ఉద్యోగి అని స్పష్టం చేసింది. ది గార్డియన్ ప్రకారం తాల్ హనాన్ ఇప్పుడు "జార్జ్" అనే మారుపేరును ఉపయోగించి ప్రస్తుతం ప్రైవేట్‌గా పని చేస్తున్నాడని రెండు దశాబ్దాలకు పైగా వివిధ దేశాలలోని ఎన్నికలను ప్రభావితం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు కథనంలో పేర్కొంది.

టీమ్ జార్జ్ ఇప్పటి వరకు యూకే, యూఎస్, కెనడా, జర్మనీ, స్విట్జర్లాండ్, మెక్సికో, సెనెగల్, భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా దాదాపు 20 దేశాల్లో ఎక్కువగా వాణిజ్య వివాదాలతో కూడిన నకిలీ సోషల్ మీడియా ప్రచారాల్లో ఉందని నివేదిక పేర్కొంది. కాగా ఇప్పటికే ఇజ్రాయేల్ సాప్ట్ వేర్ పెగాసెస్‌పై భారత్‌లో తీవ్ర దుమారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 'టీమ్ జార్జ్' భారత్‌లో ఎన్నికలను ప్రభావితం చేస్తోందనే అంతర్జాతీయ కథనం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ కథనాల ఆధారంగా కాంగ్రెస్ బీజేపీపై తీవ్ర విమర్శలకు దిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా మోడీ ఇజ్రాయేల్ సంస్థలతో కుమ్మక్కయ్యారని విమర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా అలాంటి సంస్థలు ఇండియాలో పని చేయజాలవని, బీజేపీ ఐటీ సెల్‌తో పాటు ఆ ఏజెన్సీలు కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగిన భారత్ జోడో యాత్రపై బీజేపీ అడుగడుగునా విషం చిమ్మిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు, పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిన ఓ బాలిక రాహుల్‌ను కలిసిందని కొన్ని ఫేక్ వీడియోలతో ప్రచారం చేశారని దీని వెనుక బీజేపీ ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాగా అదానీ గ్రూప్‌పై హిండెన్ బర్గ్ వంటి అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన నివేదిక దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. దానిపై విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఏకంగా దేశ ఎన్నికలనే ఇజ్రాయేల్ కు చెందిన రహస్య టీమ్ ప్రభావితం చేస్తోందన్న ఓ అంతర్జాతీయ సంస్థ కథనం దేశ రాజకీయాలను షేక్ చేసే విధంగా మారింది.

Also Read...

సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్

Next Story

Most Viewed