నూతన పార్లమెంట్ భవనం జాతికి అంకితం: ప్రధాని మోదీ

by Dishaweb |
నూతన పార్లమెంట్ భవనం జాతికి అంకితం:  ప్రధాని మోదీ
X

న్యూఢిల్లీ : కొత్త పార్లమెంటు ప్రారంభంతో 140 కోట్ల మంది భారతీయుల కల సాకారమైందని .. ఆ ప్రజాస్వామ్య సౌధాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం కేవలం కాంప్లెక్స్ మాత్రమే కాదని.. భారతీయులందరి ఆకాంక్షలకు ప్రతీక అని పేర్కొన్నారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ఆదివారం మధ్యాహ్నం ఘనంగా పార్రంభించి జాతికి అంకితం ఇచ్చిన అనంతరం ఆయన ప్రసంగించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలోని ఈ సువర్ణ లిఖిత క్షణాల వేళ దేశప్రజలందరికీ ప్రధాని మోడీ అభినందనలు తెలియజేశారు. దేశపు అభివృద్ధి ప్రయాణంలో ఈ క్షణాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన అన్నారు.

కొత్త పార్లమెంట్ .. కొత్త భారత్ కు కొత్త జోష్ తీసుకొచ్చిందన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో వారసత్వం, వాస్తు, కళ, నైపుణ్యం, సంస్కృతి, రాజ్యాంగంలోని స్వరాలు దాగి ఉన్నాయని చెప్పారు. మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను నిజం చేయడానికి ఇది ఒక మాధ్యమమని పేర్కొన్నారు. " భారతదేశం అభివృద్ధి చెందితేనే ప్రపంచం పురోగమిస్తుంది.. ఈ కొత్త పార్లమెంట్ భారతదేశ అభివృద్ధి ద్వారా ప్రపంచ అభివృద్ధికి బాటలు వేస్తుంది. విజయానికి మొదటి షరతు విజయంపై నమ్మకమే. ఈ కొత్త పార్లమెంటు ఈ నమ్మకానికి కొత్త ఎత్తులను ఇస్తుంది.

ఇది అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి, అందులోని పౌరులు అందరికీ ప్రేరణగా నిలుస్తుంది" అని ప్రధాని మోడీ అన్నారు. "భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి.. ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఇది పునాది" అని వ్యాఖ్యానించారు. "కొత్త పార్లమెంటు భవనం ఆత్మనిర్భర్ భారత్ ఆవిర్భావానికి నిదర్శనం. ఇది 2047 వరకు మనం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వికసిత భారత్ వైపు మన ప్రయాణానికి సాక్ష్యం" అని చెప్పారు. “విదేశీ పాలకులు మన ఆత్మగౌరవాన్ని మన నుంచి దొంగిలించారు. నేడు భారతదేశం సొంతంగా, స్వశక్తితో పార్లమెంట్ ను కట్టుకుంది. మన స్వతంత్ర భావనకు ఇది ప్రతీక" అని తెలిపారు.

భవిష్యత్ అవసరాల కోసమే పెద్ద పార్లమెంటు

" భవిష్యత్ అవసరాల కోసం కొత్త పార్లమెంటును కట్టుకున్నాం. మరి రానున్న కాలంలో లోక్ సభ సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందేమో చూడాలి. అందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కొత్త భవనంలో 1272 మంది సభ్యులు కూర్చునే వీలు ఉంది. పాత పార్లమెంట్ భవనంలో కూర్చోవడానికే కాకుండా.. సాంకేతికంగానూ ఇబ్బంది ఉండేది" అని ప్రధాని ఈసందర్భంగా కామెంట్ చేశారు. పవిత్రమైన 'సెంగోల్' రాజదండం వైభవాన్ని పునరుద్ధరించే అవకాశాన్ని పొందడం తమ ప్రభుత్వ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇకపై లోక్ సభలో కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడల్లా 'సెంగోల్' .. లోక్ సభ సభ్యులందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. " సేవ, కర్తవ్యానికి ప్రతీక సెంగోల్ .. చోళ సామ్రాజ్య చరిత్రలో సెంగోల్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది " అని వెల్లడించారు. కొత్త పార్లమెంట్ లో ఆధునిక సౌకర్యాలు, అత్యాధునిక గాడ్జెట్‌లు ఉన్నాయని తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణంతో 60,000 మంది కార్మికులకు ఉపాధి లభించిందని, భవనంలో నిర్మించిన డిజిటల్ గ్యాలరీని వారికి అంకితం ఇచ్చామని ప్రధాని మోదీ చెప్పారు. అంతకుముందు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌ల సందేశాలను చదివి వినిపించారు.

ఇవి కూడా చదవండి:

ప్రధాని మోడీ పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్టూన్ (28-5-2023)


Next Story

Most Viewed