పార్టీ మారనున్నారనే ఊహాగానాలకు చెక్ పెట్టిన కమల్ నాథ్

by Dishanational1 |
పార్టీ మారనున్నారనే ఊహాగానాలకు చెక్ పెట్టిన కమల్ నాథ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరతారనే ఊహాగానాల మధ్య ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని ప్రజలను, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో ఆయన, 'రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు స్వాగతం పలికేందుకు మధ్యప్రదేశ్ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. 'మా నాయకుడు' రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా వీధుల్లో నిలబడి అన్యాయం, అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని' ట్వీట్ చేశారు. ఈ యాత్రలో పాల్గొని రాహుల్ గాంధీకి బలం, ధైర్యం ఇవ్వాలని ప్రజలను, పార్టీ కార్యకర్తలను కోరుతున్నాను. దేశంలో జరుగుతున్న అన్యాయానికి ముగింపు పలికేందుకు మీరు, నేను కలిసి పోరాడదామని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల మాజీ కాంగ్రెస్ నేత, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా జై శ్రీరామ్ అనే శీర్షికకు నకుల్ నాథ్‌తో కలిసి ఉన్న కమల్ నాథ్ ఫోటోను పోస్ట్‌ చేయడంతో ఆయన పార్టీ మారనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీని గురించి ఆయనను నేరుగా అడిగినప్పుడు అలాంటిదేదైనా ఉంటే బహిరంగంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు. రెండు వారాల క్రితం ఈ ఊహాగానాలపై ఆయన ట్వీట్ చేశారు కూడా. కాంగ్రెస్ సిద్ధాంతం సత్యం, న్యాయాన్ని అనుసరించడం. దేశంలోని అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, ఆలోచనలకు సమాన గౌరవం అందించడం కాంగ్రెస్ సిద్ధాంతంలోనే ఉంది. 138 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పోరాటం, సేవలకే పరిమితమైందన్నారు. 'ఈరోజు దేశంలో ప్రతిపక్షాలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యంపై దాడిని కాంగ్రెస్ పార్టీ, దాని సిద్ధాంతమే ఎదుర్కొని దేశాన్ని కాపాడుతోందని' పేర్కొన్నారు.

Next Story

Most Viewed