ఐఎన్‌ఎల్‌డీ హర్యానా చీఫ్ మర్డర్ కేసు.. గుట్టు రట్టు

by Dishanational4 |
ఐఎన్‌ఎల్‌డీ హర్యానా చీఫ్ మర్డర్ కేసు..  గుట్టు రట్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) పార్టీ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు నఫే సింగ్ రాఠీ హత్య వ్యవహారంలో కొత్త కోణం వెలుగుచూసింది. ఝజ్జర్ జిల్లా బహదూర్‌ఘర్ నియోజకవర్గానికి గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా నఫే సింగ్ రాఠీ వ్యవహరించారు. అయితే ఏడాది క్రితం (2023 జనవరిలో) బహదూర్‌ఘర్ నియోజకవర్గ బీజేపీ నేత జగదీశ్ రాఠీ అనుమానాస్పద స్థితిలో సూసైడ్ చేసుకున్నారు. ఆయన విషం తాగి చనిపోయారని అప్పట్లో గుర్తించారు. విషం తాగడానికి రెండు రోజుల ముందు జగదీశ్ రాఠీ ఒక ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. ‘‘నఫే సింగ్ రాఠీ సహా పలువురు మమ్మల్ని వేధించారు. 2019లో మా దుకాణాన్ని లాక్కున్నారు. మా పూర్వీకుల భూమి, ఇల్లు కూడా లాక్కుంటామని బెదిరించారు’’ అని అందులో బీజేపీ నేత జగదీశ్ రాఠీ చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి మాంగే రామ్ నంబార్దార్ కుమారుడే జగదీశ్ రాఠీ. ఈ ఆడియో క్లిప్‌పై అప్పట్లో స్పందించిన పోలీసులు నఫే సింగ్ రాఠీతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. అయితే వారందరికీ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే తాజాగా ఐఎన్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు నఫే సింగ్ రాఠీ హత్య కేసు నిందితుల జాబితాలో జగదీష్ రాఠీ కుమారుడు గౌరవ్, సోదరుడు సతీష్ పేర్లు ఉన్నాయి. నిందితుల్లో బీజేపీ నేత నరేంద్ర కౌశిక్, బహదూర్‌గఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సరోజ్ రాఠీకి చెందిన ముగ్గురు బంధువులు కూడా ఉన్నారు. వారిపై హత్య, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఆయుధాల చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.

మేమంతా టార్గెట్‌లో ఉన్నాం.. నఫే సింగ్ కుమారుడు

‘‘మేమంతా టార్గెట్‌లో ఉన్నామని ఆరు నెలల క్రితమే గుర్తించాం. దీనిపై జిల్లా ఎస్పీకి, ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను గతంలో కలిశాం. అయినా మాకు సెక్యూరిటీ కల్పించలేదు. అందుకే మా నాన్న నఫే సింగ్ రాఠీ మర్డర్ సాధ్యమైంది. గతంలోనూ మా నాన్నను హత్య చేయడాన్ని వాళ్లు యత్నించారు. ఈసారి ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు’’ అని నఫే సింగ్ రాఠీ కుమారుడు జితేంద్ర మీడియాకు తెలిపారు. కాగా, నఫే సింగ్ రాఠీ బహదూర్‌ఘర్‌లోని తన ఇంటికి తిరిగొస్తూ మార్గం మధ్యలో ఒక రైల్వే క్రాసింగ్ దగ్గర కారును ఆపారు. అదే అదునుగా ఐదుగురు షూటర్లు ఆ కారుపైకి బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో నఫే సింగ్, ఆయన అనుచరుడు ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.


Next Story

Most Viewed