మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ నిరాకరణ!

by Disha Web Desk 6 |
మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ నిరాకరణ!
X

చెన్నై: మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన తమిళనాడు మత్రి వి సెంథిల్ బాలాజీకి ఎదురుదెబ్బ తగిలిచింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు గురువారం కొట్టివేసింది. సెంథిల్ బాలాజీకి బెయిల్ మంజూరును జస్టిస్ జి జయచంద్రన్ తోసిపుచ్చారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద అరెస్టయిన వ్యక్తికి వైద్యపరమైన కారణాలతో బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని జయచంద్రన్ అన్నారు. పీఎంఎల్ఏ కింద మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ జూన్ 14న మంత్రిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన వెంటనే ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

ఆ తర్వాత కావేరీ ఆసుపత్రికి తీసుకెళ్లగా బైపాస్ సర్జరీ చేశారు. అనంతరం జూలై 17న ఆయనను పుఝుల్ సెంట్రల్ జైలులోని జైలు ఆసుపత్రికి తరలించారు. తాను 100 రోజులకు పైగా జైలులో ఉన్నానని, కస్టడీ విచారణలో ఈడీకి సహకరించానని బెయిల్ దరఖాస్తులో సెంథిల్ బాలాజీ పేర్కొన్నారు. ఇప్పటివరకు పిటిషనర్ లేదా అతని కుటుంబసభ్యులు సాక్షులలో ఎవరినీ ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్టు ఫిర్యాదు లేదని సెంథిల్ బాలాజీ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అయితే, ఈడీ వాదనలు, పిటిషనర్ సోదరుడు పరారీలో ఉండటం, పిటిషనర్ మంత్రి కావడంతో, సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని భావిస్తూ జడ్జి బెయిల్‌ను నిరాకరించారు.


Next Story