‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే రిపోర్ట్.. మళ్లీ అధికారం ఎన్డీఏదే.. ఈసారి 335 సీట్లు

by Dishanational4 |
‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే రిపోర్ట్.. మళ్లీ అధికారం ఎన్డీఏదే.. ఈసారి 335 సీట్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై ‘ఇండియా టుడే - సీ ఓటర్’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (MOTN) ఒపీనియన్ పోల్ సర్వేలో సంచలన అంచనాలు వెలువడ్డాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) కూటమికి ‘అబ్కీ బార్ 400 పార్’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెబుతున్నప్పటికీ.. అది సాధ్యపడకపోవచ్చని, 335 సీట్లకే ఎన్డీఏ పరిమితం కావచ్చని సర్వే తేల్చింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను ఎన్డీఏ సునాయాసంగా సాధిస్తుందని పేర్కొంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్డీఏ కూటమి దాదాపు 18 సీట్లను కోల్పోయే అవకాశముందని సర్వే నివేదిక తెలిపింది. ఎన్డీఏ కూటమిలోని పార్టీల అభ్యర్థులు ఓడిపోయే స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు లబ్ధి పొందుతారని వెల్లడించింది. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేను 2023 డిసెంబర్ 15 నుంచి జనవరి 28 మధ్య నిర్వహించారు. ఈ వ్యవధిలో దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోని 35,801 మందిని సర్వే చేశారు. పార్టీల వారీగా సీట్ల వాటా విషయానికొస్తే.. 543 లోక్‌సభ సీట్లలో 304 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని సర్వే నివేదిక అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో బీజేపీకి 303 స్థానాలు రాగా, ఈసారి ఒక సీటు పెరగొచ్చని పేర్కొంది. కాంగ్రెస్‌ గత ఎన్నికల కంటే 19 స్థానాలను ఎక్కువగా సాధించి మొత్తం 71 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి 166 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వే నివేదికలో ప్రస్తావించారు.

ఉత్తర, దక్షిణ, పశ్చిమ, తూర్పు భారత్‌లలో ఇలా..

ఉత్తర భారత దేశంలో బీజేపీ హవా కొనసాగుతుందని సర్వే నివేదిక అంచనా వేసింది. హిందీ బెల్ట్‌లో బీజేపీ పలు రాష్ట్రాలను క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపింది. ఉత్తర భారతదేశంలోని 180 స్థానాలకుగానూ ఎన్డీ‌ఏకు 154, ఇండియా కూటమికి 25 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. దక్షిణ భారతదేశంలోని 132 లోక్‌సభ స్థానాలకుగానూ ఎన్డీఏకు 27, ఇండియా కూటమికి 76 స్థానాలు రావచ్చని చెప్పింది. దేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న మొత్తం 153 లోక్‌సభ స్థానాలకుగానూ ఎన్డీఏకు 103, ఇండియా కూటమికి 38 రావచ్చని సర్వేలో గుర్తించారు. పశ్చిమ భారతదేశంలోని 78 స్థానాలకుగానూ ఎన్డీఏ కూటమికి 51, ఇండియా కూటమికి 27 స్థానాలు రావచ్చని సర్వేలో ఫలితం వచ్చింది.

సర్వే ప్రకారం.. ఈ ఎన్నికల్లో టాప్-5 ప్రభావిత అంశాలివే..

1.రామమందిర నిర్మాణంతో ప్రధానమంత్రి మోడీ పట్ల ఆకర్షితులం అయ్యామని సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది చెప్పారు. భారతదేశానికి ప్రధాని మోడీ ప్రపంచ స్థాయిని అందించారని 19 శాతం మంది చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుతో ప్రభావితమయ్యామని, బీజేపీకి చేరువయ్యామని 12 శాతం మంది అన్నారు.

2. కరోనా సంక్షోభం టైంలో మోడీ సర్కారు బాగా పనిచేసిందని ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 20 శాతం మంది చెప్పారు. రామ మందిర నిర్మాణాన్ని మోడీ సర్కారు సాధించిన పెద్ద విజయంగా 17 శాతం మంది అభివర్ణించారు. అవినీతి రహిత ఇమేజ్‌ మోడీ సొంతమని 14 శాతం మంది అన్నారు.

3.నిరుద్యోగం అనేది మోడీ సర్కారు అతిపెద్ద వైఫల్యమని సర్వేలో పాల్గొన్నవారిలో 18 శాతం మంది చెప్పారు.

మోడీ సర్కారు వైఫల్యాల జాబితాలో నిత్యావసరాల ధరల పెరుగుదలదే నంబర్ 1 ప్లేస్ అని 24 శాతం మంది తెలిపారు. కరోనా సంక్షోభ నిర్వహణలో మోడీ ఫెయిల్ అయ్యారని 13 శాతం మంది తెలిపారు.

4. దేశంలో అతి ముఖ్య సమస్య నిరుద్యోగం అని సర్వేలో పాల్గొన్న 26 శాతం మంది చెప్పారు. ఉద్యోగ కల్పన, ఆర్థిక సంస్కరణల అవసరాన్ని వీళ్లు హైలైట్ చేశారు. నిత్యావసరాల ధరల మంట ఎఫెక్టుతో తాము కేంద్ర సర్కారుపై వ్యతిరేకత పెంచుకున్నామని 19 శాతం మంది చెప్పారు.

5. మోడీ ప్రభుత్వం అవినీతిని తగ్గించగలిగిందా ? లేదా ? అని సర్వేలో పాల్గొన్న వారిని ప్రశ్నించగా.. దేశం రెండుగా చీలిపోయింది. 46 శాతం మంది 'అవును' అని, 47 శాతం మంది 'కాదు' అని బదులిచ్చారు.

Next Story

Most Viewed