అంతర్జాతీయ తృణధాన్యాల సదస్సులో ప్రధాని మోడీ..

by Disha Web Desk 6 |
అంతర్జాతీయ తృణధాన్యాల సదస్సులో ప్రధాని మోడీ..
X

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కోవడంలో మిల్లెట్లు సహాయపడుతాయని అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు జాతీయ ఆహార బాస్కెట్‌లో పోషక-తృణధాన్యాల వాటాను పెంచడానికి కృషి చేయాలని కోరారు. శనివారం ‘అంతర్జాతీయ మిల్లెట్స్(శ్రీ అన్న) సదస్సు’ కార్యక్రమంలో ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. భారత ప్రతిపాదనలతో ఐక్యరాజ్యసమితి 2023ను ‘అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం’గా ప్రకటించడం గొప్ప గౌరవమని చెప్పారు. శ్రీ అన్న లేదా తృణధాన్యాలు(మిల్లెట్స్)ను అంతర్జాతీయంగా ప్రచారం చేసేందుకు భారత్ పనిచేస్తుందని చెప్పారు. విపరీత వాతవరణ పరిస్థితుల్లోనూ ఎదిగే సామర్థ్యం తృణధాన్యాలకు ఉందని నొక్కి చెప్పారు. ఎలాంటి కెమికల్స్, ఫెర్జిలైజర్స్ వీటికి అవసరం లేదని చెప్పారు.

భారత మిల్లెట్స్ మిషన్ దేశవ్యాప్తంగా 2.5 కోట్ల చిన్న, మధ్యస్థ రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశ ఆహార వాటాలో మిల్లెట్స్ భాగస్వామ్యం 5-6 శాతం మాత్రమే ఉందని, శాస్త్రవేత్తలు, రైతులు కలిసి దీనిని పెంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఆహార రంగం కోసం ఉత్పత్తి అనుసంధాన ఇన్సెంటివ్ స్కీమ్‌ను అవిష్కరించిందని చెప్పారు. కంపనీలు దీనిని అనుకూలంగా చేసుకుని మిల్లెట్స్ ఆధారిత ఉత్పత్తులను పెంచాలని కోరారు. ఈ సదస్సు కేవలం ప్రపంచానికి సానుకూలం కాదని అంతర్జాతీయంగా భారత్‌కు పెరుగుతున్న బాధ్యతకు గుర్తు అని చెప్పారు.

తృణధాన్యాలు ఆకలిని తొలగించడంతో పాటు వాతవరణ మార్పులను తట్టుకుని నిలబడుతాయని ఇథియోపియా అధ్యక్షురాలు సహ్లే జెవ్డే అన్నారు. ఈ సదస్సు ఉమ్మడి కార్యచరణతో పాటు మిల్లెట్ల వైపు ప్రత్యక్ష విధానాన్ని తీసుకొస్తుందని భావిస్తున్నట్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. 72 దేశాల మద్దతుతో ఐరాస సాధారణ మండలి 2021లో 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. భారత్ ఏటా 170 లక్షల టన్నులు మిల్లెట్లను ఉత్పత్త చేస్తుంది. ఇది ఆసియా ఉత్పత్తిలో 80 శాతం కాగా, ప్రపంచ ఉత్పత్తిలో 20శాతంగా ఉంది. అంతకుముందు ఉదయం అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరాన్ని ప్రతిబింబించేలా ప్రధాన మంత్రి రూ.75 పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.

Also Read..

లిక్కర్ స్కాం కేసు దర్యాప్తుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు


Next Story