సుప్రీమ్ కోర్టు విచారణ సెట్టింగ్ తో భారీ సైబర్ మోసం

by Y. Venkata Narasimha Reddy |
సుప్రీమ్ కోర్టు విచారణ సెట్టింగ్ తో భారీ సైబర్ మోసం
X

దిశ, వెబ్ డెస్క్ : సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యం అందరికి తెలిసిందే. అయితే ఏకంగా సుప్రీంకోర్టు సెట్టింగ్ వేసి..సీజేఐ చంద్రచూడ్ విచారిస్తున్నట్లుగా మభ్యపెట్టి కోట్లు కొల్లగొట్టిన వైనం మాత్రం మోసాల్లో కెల్లా వైరటీ మోసంగా నిలిచింది. ప్రముఖ టెక్స్‌టైల్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్, ఎండీ ఓస్వాల్ సైబర్ మోసగాళ్ల వలలో ఇరికించిన సైబర్ కేటుగాళ్ళు సీజేఐ చంద్రచూడ్ కేసు విచారిస్తున్నట్లు కోర్టు సెట్టింగ్ వేసి రూ.7 కోట్లు కొల్లగొట్టారు. తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన ఓస్వాల్ పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకుని రూ.5.25 కోట్లు తిరిగి రాబట్టారు. వివరాల్లోకి వెళితే టెక్స్‌టైల్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్, ఎండీటఓస్వాల్ కు ఆగస్టు 28న ఓ ఆగంతకుడు ఫోన్ చేసి ముంబైలోని కొలాబాద్‌లో ఉన్న సీబీఐ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకుని మీ పేరుతో ఉన్న కెనరా బ్యాంక్‌ అకౌంట్‌లో చాలా ఆర్థిక అవకతవకలు జరిగాయి’ అని చెప్పాడు. ముఖ్యంగా మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జెట్ ఎయిర్‌వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్ వ్యవహారంతో మీ అకౌంట్‌కు లింక్ ఉన్నట్లు తెలిసిందని.. దీని కారణంగానే మిమ్మల్ని ఈ కేసులో నిందితులుగా చేరుస్తున్నట్లు తెలిపాడు. అయితే ఓస్వాల్ మాత్రం తనకు కెనరా బ్యాంక్‌లో అకౌంటే లేదని, జెట్ ఎయిర్‌వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్ ఎవరో తనకి తెలియదని చెప్పారు. అయితే ఓ సారి జెట్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణం చేశానని.. ఆ సమయంలో ఆధార్ కార్డు ఇచ్చి ఉంటానని తెలిపారు. అలాగైతే మీ ఆధార్‌కార్డుతోనే ఎక్కడో దుర్వినియోగం జరిగిందని చెప్తూ.. దీని కారణంగానే మిమ్మల్ని ఈ కేసులో నిందితులుగా చేరుస్తున్నట్లు సైబర్ నేరగాడు ఓస్వాల్ ను నమ్మించారు.

డిజిటల్ కస్టడీ పేరుతో బురిడీ

కేసులో భాగంగానే మిమ్మల్ని డిజిటల్ కస్టడీలోకి తీసుకుంటున్నట్లు కేటుగాడు ఓస్వాల్ కు చెప్పాడు. అనంతరం ముఠాలోని మరో నిందితుడు ఓస్వాల్ కు వీడియో కాల్ చేసి తాను ఛీప్ ఇన్వెస్టింగ్ ఆఫీసర్‌నని చెప్పి సైబర్ అరెస్టుకు సంబంధించిన నిబంధనలను ఓస్వాల్‌కు వాట్సాప్‌ ద్వారా పంపించాడు. ముఠాలోని మరో సభ్యుడు వీడియో కాల్‌లో జాయిన్ అయి ఓస్వాల్ బాల్యం, విద్యాబ్యాసం, ఉద్యోగం, బిజినెస్, ఆస్తుల వివరాలు తెలుసుకున్నాడు. అలా ఓస్వాల్‌తో నిందితులు వాట్సాప్ వీడియో కాల్‌ సంప్రదింపులు కొనసాగిస్తు.. కాల్ కట్ చేయొద్దని.. అలా చేస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని.. కాల్‌లోనే ఉండాలని, బయటకు వెళ్తే తమకు చెప్పాలని హెచ్చరించారు. ఈ కేసు ‘జాతీయ రహస్యాల చట్టం’ కింద నమోదైందునా.. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పడానికి వీల్లేదని, ఒకవేళ ఎవరికైనా చెప్పారంటే వారికి 3 నుంచి 5 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని బెదిరించారు.

సుప్రీంకోర్టు సెట్టింగ్

ఆపై వీడియో కాల్‌లో కోర్టు విచారణ జరిపారు. ఈ కేసును సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ విచారిస్తున్నట్లు సెట్టింగు వేశారు. ఆపై సుప్రీంకోర్టు లోగో, స్టాంపులతో ఓస్వాల్‌కు డిజిటల్ ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా ఈడీ, ముంబై పోలీసుల లోగోలతో కూడా అరెస్టు వారెంట్ ను ఓస్వాల్‌కు వాట్సాప్ ద్వారా పంపించారు. ఇవన్నీ నిజమేననుకొన్న ఓస్వా్ల్ బెదిరిపోయాడు. దీంతో సైబర్ నేరగాళ్ళు ఓస్వాల్ కు కాల్ చేసి మేము ఈడీ, సీబీఐ అధికారులమని.. మిమ్మల్ని ఈ కేసు నుంచి తప్పిస్తామని.. అయితే అందుకు తమకు రూ.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటికే బెదిరిపోయిన ఓస్వాల్ వెంటనే వేర్వేరు అకౌంట్లకు రూ.7 కోట్లు బదిలీ చేశారు. ఈ వ్యవహారమంతా దాదాపు రెండు రోజులు సాగింది. ఈ మోసంలో సైబర్ మోసగాళ్ళే సీబీఐ, ఈడీ ఆఫీసర్లుగా, జడ్జిలుగా వేషాలు వేయడంతో పాటు డిజిటల్ కస్టడీ, పోలీసుల లోగోలతో వాట్సాప్ అరెస్టు వారెంట్లతో నాటకాన్ని రక్తి కట్టించారు.

ఇక అంతా అయిపోయిన తర్వాత ఓస్వాల్ తాను మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రూ.5.25 కోట్లను తిరిగి రప్పించారు. అస్సాంలోని గౌహతికి చెందిన చౌదరి, ఆనంద్ కుమార్ అనే ఇద్దరు నిందితులతో పాటు తెరవెనుక సూత్రధారియైన ఓ మాజీ బ్యాంకు ఉద్యోగి రుమి కలితా కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే ఈ కేసులో చేసిన మోసంలో మాదిరిగా చట్టం ప్రకారం ఎలాంటి డిజిటల్ అరెస్టు ప్రక్రియ లేదని, ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు.

Advertisement

Next Story