Coromandel express accident : గత పదేళ్లలో ఇదే అతిపెద్ద ప్రమాదం.. 2012 నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రధాన రైల్వే ప్రమాదాలు ఇవే!

by Disha Web Desk 19 |
Coromandel express accident : గత పదేళ్లలో ఇదే అతిపెద్ద ప్రమాదం.. 2012 నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రధాన రైల్వే ప్రమాదాలు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: కోరమండల్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ప్రమాదం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. గంట గంటకు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. కాగా, హౌరా నుంచి చెన్నై వెళ్తోన్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ శుక్రవారం రాత్రి ఒడిషాలో ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఒడిషాలోని బహనాగ్ జిల్లాలోని ఓ స్టేషన్‌లో ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ వేగంగా ఉండటంతో రైలు బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 237 మంది మృతి చెందగా.. దాదాపు మరో 900 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం.

అంతేకాకుండా మరో 600 మంది ప్రయాణికులు ఇంకా ట్రైన్ బోగీల్లోనే చిక్కుకున్నట్లు సమాచారం. ఇక, రైల్వే అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 230 మందికి పైగా మృతి చెందడంతో.. ఈ దశాబ్ధంలో దేశంలో జరిగిన రైలు ప్రమాదాల్లో ఇదే అతి పెద్ద ప్రమాదంగా తెలుస్తోంది. కాగా, ఈ పదేళ్లలో భారత్‌లో పెద్ద రైలు ప్రమాదాలను పరిశీలిస్తే ఈ విషయంపై క్లారిటీ వస్తోంది.

భారత్‌లో గత పదేళ్లలో జరిగిన ప్రధాన రైలు ప్రమాదాలు:

1. ఆంధ్రప్రదేశ్ సమీపంలో 2012 మే 22వ తేదీన హూబ్లీ, బెంగళూర్ మధ్య నడిచే హంపి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హంపి ఎక్స్ ప్రెస్ 4 బోగీలు పట్టాలు తప్పగా.. దాదాపు 25 మంది వరకు మరణించారు.

2. 2014 మే 26వ తేదీన ఉత్తర ప్రదేశ్‌లో గోరఖ్‌దామ్ ఎక్స్‌ప్రెస్ ఖలీలాబాద్ స్టేషన్‌లో ఆగి ఉన్న మరో గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు.

3. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని పుఖ్రాయాన్‌కు దగ్గర్లో 2016 నవంబర్ 20 తేదీన పాట్నా- ఇండోర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దాదాపు 150 మంది వరకు మృతి చెందారు.

4. 2017 ఆగస్ట్ 23వ తేదీన ఢిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్‌ప్రెస్ ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ.. దాదాపు 70 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

5. హరిద్వార్- పూరీ మధ్య నడిచే ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ముజఫర్ నగర్‌లో 2018 ఆగస్ట్ 18వ తేదీన ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు.

6. బికనీర్- గౌహతి ఎక్స్‌ప్రెస్ 2022 జనవరి 13న ప్రమాదానికి గురైంది. పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్ దువార్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు.

7. హౌరా నుండి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ 2023 జూన్ 2వ తేదీన ఒడిషాలో ఘోర ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న మరో గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 233 మంది మరణించగా.. దాదాపు 1000 మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Next Story

Most Viewed