పౌర స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైనది: సుప్రీంకోర్టు

by Dishanational1 |
పౌర స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైనది: సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: పౌర స్వేచ్ఛ చాలా ముఖ్యమైనదని, దీనికి సంబంధించిన అంశాల్లో విషయాన్ని త్వరగా నిర్ణయించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇచ్చిన హక్కును కోల్పోవడమే అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ 21 రాజ్యాంగానికి ఆత్మ లాంటిదని సుప్రీంకోర్టు తెలిపింది. ట్రయల్ కోర్టులో దాఖలు చేసేందుకు తన బెయిల్ దరఖాస్తును కొట్టివేస్తూ 2023, మార్చి 30న బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ నిందితుడు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. దీనికి సంబంధించి బెయిల్ లేదా ముందస్తు బెయిల్ దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవడంలో బాంబే హైకోర్టు అనుసరిస్తున్న తీరు నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు మెరిట్‌లపై నిర్ణయం తీసుకోకుండా, వివిధ కారణాలతో కేసును నిలిపేయడానికి సాకును వెతుక్కోవడాన్ని గమనించామని జస్టిస్ బీఆర్ గవాయ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది. 'కాబట్టి బెయిల్ లేదా ముందస్తు బెయిల్‌కు సంబంధించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తులందరికీ తెలియజేయాల్సిందిగా బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థిస్తున్నామని' బెంచ్ పేర్కొంది.


Next Story

Most Viewed