కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల పూర్తి బాధ్యతలు.. ప్రియాంకగాంధీకి కీలక పదవి

by Disha Web Desk 4 |
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల పూర్తి బాధ్యతలు.. ప్రియాంకగాంధీకి కీలక పదవి
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని అధికారం వైపు నడిపించాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై మరింత దృష్టి సారించే కసరత్తులో భాగంగా ఏఐసీసీ సంచలన మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ ఇన్ ఛార్జి బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ పూర్తి స్థాయి బాధ్యతలను ప్రియాంకకే అప్పగించాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ మీటింగ్ తర్వాత ఈ నిర్ణయం వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు పార్టీలోని ముఖ్య నేతలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతుండగా.. బీజేపీ సంధిస్తున్న పొలిటికల్ ఫోర్స్ ను అడ్డుకుని పార్టీని తిరిగి పుంజుకునేలా చేసేందుకు అధిష్టానం చర్యలు తీసుకోబోతోంది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి స్కోప్ ఉండటంతో పాటు ఈ రెండు రాష్ట్రాల్లోని నేతల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా బహిర్గతం అవుతోంది. దీంతో ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఏఐసీసీలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రియాంక గాంధీకే నేరుగా ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగించే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి సీనియర్ల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఇక కర్ణాటకలోనూ పార్టీ సీనియర్ నేత డీకే.శివకుమార్ కు మాజీ ముఖ్యమంత్రి సిద్దిరామయ్యకు మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో నేతల మధ్య అనైక్యత కారణంగా నష్టం జరగకుండా అడ్డుకట్ట వేసే ఉద్దేశంలో భాగంగా ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని సజావుగా జరిగితే మరో వారం రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ ఛార్జిగా ప్రియాంక గాంధీ రాబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


Next Story

Most Viewed