గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌లో కీలక మార్పు: రూ.13 వేల కోట్లతో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-09 10:51:24  IST  )

గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది.

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌లో కీలక మార్పు: రూ.13 వేల కోట్లతో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేట్ నికోబార్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే మొత్తం రూ.81,000 కోట్ల మెగా డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌‌పై దేశంలో పెద్ద ఎత్తున రాజకీయ వివాదం నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ వల్ల అక్కడి దట్టమైన అడవులు అంతరించిపోతాయని, స్థానిక షోంపెన్ (Shompen) గిరిజన తెగలకు ముప్పు పొంచి ఉందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘గ్రీన్ ఓవర్ గ్రీడ్’ అనే నినాదంతో ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్న తరుణంలో కేంద్రం గ్రేట్ నికోబర్ ప్రాజెక్టులో కీలక మార్పలు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం అక్కడ ఉన్న భారత నౌకాదళ ఎయిర్‌ఫీల్డ్ ఐఎన్ఎస్ బాజ్ (INS Baaz)ను విస్తరించాలనే ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ పక్కనబెట్టింది. అందుకు బదులుగా గ్రేట్ నికోబార్‌లోని ఆగ్నేయ తీరంలో ఉన్న చింగెన్ (Chingen) గ్రామం వద్ద ఏకంగా రూ.13 వేల కోట్ల భారీ వ్యయంతో సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ సివిల్-మిలిటరీ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలని నిర్ణయించింది. ఇది కేవలం మిలటరీ అవసరాలకే కాకుండా, భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఓ టూరిజం పరంగా వాణిజ్య కేంద్రంగా మార్చేందుకు పౌర విమానయాన రంగానికి కూడా ఉపయోగపడనుంది.

‘INS బాజ్’ ఎందుకు ఆపారంటే..

ప్రస్తుతం క్యాంప్‌బెల్ బే వద్ద ఉన్న ఐఎన్ఎస్ రన్‌వే పొడవు కేవలం 4,500 అడుగులు మాత్రమే. సైనిక అవసరాల కోసం దీనిని 10 వేల అడుగులకు విస్తరించాలని తొలుత భావించారు. అయితే, అక్కడి భౌగోళిక పరిస్థితులు, కొండల ప్రాంతం కావడం వల్ల ఈ విస్తరణ సాధ్యం కాదని రక్షణ రంగ సాంకేతిక అధ్యయనాల్లో తేలింది. ఇక ఓల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను విస్తరించడం కంటే గలాథియా బే (Galathea Bay) సమీపంలోని చింగెన్ వద్ద కొత్తగా ఎయిర్‌పోర్ట్ నిర్మించడం వల్ల పర్యావరణానికి, స్థానిక అడవులు, గిరిజన ప్రాంతాలకు తక్కువ నష్టం జరుగుతుందని నివేదకల్లో తేలింది.

చైనాపై పకడ్బందీగా నిఘా..

హిందూ మహాసముద్రంలో భారత్‌ను బలోపేతం చేసేందుకు గ్రీన్‌ఫీల్డ్ సివిల్-మిలిటరీ ఎయిర్‌పోర్ట్‌ అత్యంత కీలకం కానుంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మలాక్కా జలసంధి (Malacca Strait), చైనా నౌకలు ప్రయాణించే సిక్స్ డిగ్రీ ఛానల్ (Six Degree Channel)కు ఈ ప్రాంతం చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడి నుంచి భారీ రవాణా విమానాలు, యుద్ధ విమానాలు, అత్యాధునిక నిఘా డ్రోన్లను సులభంగా ఆపరేట్ చేయవచ్చు. సులభంగా హిందూ మహా సముద్రంలో చైనా నౌకాదళ కదలికలపై మనం మరింత గట్టి నిఘా పెట్టేందుకు కూడా అవకాశం ఉంటుంది.


'జెప్టో'కు ED నోటీసులు

Next Story