వారానికి 5 ములాఖత్‌లకు ఛాన్స్ ఇవ్వాలన్న కేజ్రీవాల్.. ఎందుకు ?

by Dishanational4 |
వారానికి 5 ములాఖత్‌లకు ఛాన్స్ ఇవ్వాలన్న కేజ్రీవాల్.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : తనపై వివిధ రాష్ట్రాల్లో పలు కేసులు నడుస్తున్నందున న్యాయవాదులతో ములాఖత్ కోసం సెషన్లను పెంచాలని కోరుతూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం దీనిపై కోర్టు విచారించింది. ప్రస్తుతానికి వారానికి రెండుసార్లు న్యాయవాదులతో ములాఖత్‌కు తనను అనుమతిస్తున్నారని.. ఆ సంఖ్యను ఐదుకు పెంచాలని కోర్టుకు కేజ్రీవాల్ రిక్వెస్ట్ చేశారు. తనపై వివిధ రాష్ట్రాల్లో కేసులు నడుస్తున్నందున వాటిపై పలువురు లాయర్లతో వివరంగా చర్చించాల్సి ఉంటుందని, అందుకోసం సరిపడా సెషన్లను తనకు కేటాయించాలని కోరారు. ఈ వాదనలు విన్న కోర్టు స్పందన తెలియజేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), తీహార్ జైలు అధికారులను కోరింది.

కటకటాల వెనుక కేజ్రీవాల్ ఫొటోతో సునీత సందేశం

జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుంచి మరో సందేశం వచ్చింది. ఎప్పటిలాగే ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్‌ ఆ సందేశాన్ని వినిపించారు. అయితే ఈ సారి ఓ ఆసక్తికర అంశం ఉంది. కేజ్రీవాల్‌ సందేశాన్ని సునీత వినిపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆమె వెనుక గోడకు అంబేడ్కర్, భగత్ సింగ్ చిత్రపటాలతో పాటు సీఎం కేజ్రీవాల్‌ ఫోటో కూడా ఉంది. అయితే కటకటాల వెనుక కేజ్రీవాల్ ఉన్నట్లుగా ఆ ఫొటోను ఏర్పాటు చేశారు. ‘‘నేను జైలులో ఉండటం వల్ల ఢిల్లీ ప్రజలు ఏ విధంగానూ బాధపడకూడదు. ప్రతి ఎమ్మెల్యే రోజూ వారివారి ఏరియాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలి’’ అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నట్లు సునీత కేజ్రీవాల్‌ వీడియోలో చదివి వినిపించారు. ‘‘ప్రజల ప్రభుత్వపరమైన సమస్యలే కాకుండా ఇతర సమస్యలను కూడా మనం పరిష్కరించాలి. ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు నా కుటుంబం. వారందరికీ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. జై హింద్’’ అని కేజ్రీవాల్ అన్నట్లుగా సునీత పేర్కొన్నారు.



Next Story

Most Viewed