‘సీఎం పదవికి రాజీనామా..’ కేజ్రీవాల్ సంచలన ప్రకటన

by karthikeya |   ( Updated:2024-09-15 07:44:59.0  )
‘సీఎం పదవికి రాజీనామా..’ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి ఢిల్లీ ప్రజలకు ఊహించని షాకిచ్చారు. కొన్ని నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయని, ఆ ఎన్నికల్లో మళ్లీ ప్రజల మధ్యకు వెళతానని చెప్పిన కేజ్రీవాల్.. తన భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చిన నేపథ్యంలో ఆప్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన కేజ్రీవాల్.. రెండు రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని, ఎన్నికల వరకు తన స్థానంలో మరొకరు సీఎంగా ఉంటారని తెలిపారు. తను అవినీతి చేయలేదని భావిస్తేనే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తనకు ఓటేయాలని, ప్రజలు ఇచ్చే ప్రతి ఓటు తన నిజాయితీకి సర్టిఫికేట్ లాంటిదని పేర్కొన్నారు. ప్రజలంతా తనకు ఓటు వేసి గెలిపించే వరకు మళ్లీ సీఎం సీటు అధిరోహించనని, ఎన్నికల్లో గెలిస్తేనే మళ్లీ పదవిని చేపడతానని శపథం చేశారు. అలాగే తాను అగ్నిపరీక్షకు సిద్ధంగా ఉన్నానని, నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి సవాల్ విసిరారు. రానున్న మహారాష్ట్ర ఎన్నికలతో పాటే ఢిల్లీ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే బీజేపీ తీరుపై కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ పార్టీని చీల్చాలనేది బీజేపీ ప్లాన్ అని, దానికోసం ఆ పార్టీ ఓ ప్లాన్‌ను కూడా రెడీ చేసుకుందని సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ చీలిపోయిన తర్వాత ఢిల్లీలో కూడా వాళ్ల జెండా ఎగరేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే కేజ్రీవాల్ ఉన్నంత సేపు ఇది సాధ్యం కాదని అర్థం కావడంతో తనని జైలుకు పంపించారని ఆరోపించారు. కానీ తనతో పాటు ఆప్ నేతలు ఎవ్వరూ బీజేపీ ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకపోవడంతో వాళ్ల ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయని వ్యాఖ్యానించారు.

కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దాదాపు ఐదున్నర నెలలపాటు జైలులో ఉన్న ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. కేజ్రీవాల్ కి బెయిల్ ఇచ్చే సమయంలో సుప్రీం కోర్టు పలు నిబంధనలు పెట్టింది. ఈ కండీషన్లలో భాగంగా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఫైళ్లపై సీఎంగా సంతకాలు చేయాలన్నా, సీఎం కార్యాలయానికి వెళ్లాలన్నా లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని కోర్టు తెలిపింది. ఈ నేపధ్యంలోనే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరో ఆరు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో కేజ్రీవాల్ రాజీనామా చర్యనీయాంశంగా మారింది. పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలని ఆప్ నేతలు నిర్ణయం తీసుకోగా.. పార్టీ అధినేత కేజ్రీవాల్ ఇప్పటినుండే ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకొని రాజీనామా నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Next Story