హిజాబ్ నిషేధంపై కేసు విచారణ పూర్తి.. తీర్పు రిజర్వులో పెట్టిన సుప్రీంకోర్టు

by Disha Web Desk 21 |
హిజాబ్ నిషేధంపై కేసు విచారణ పూర్తి.. తీర్పు రిజర్వులో పెట్టిన సుప్రీంకోర్టు
X

న్యూఢిల్లీ: కర్ణాటకలో తరగతిగదుల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ తనముందుకు వచ్చిన పిటిషన్లపై విచారణను సుప్రీకోర్టు ముగించింది. అత్యంత వివాదాస్పదమైన ఈ కేసులో తీర్పును రిజర్వు చేసింది. వరుసగా పదిరోజుల పాటు విద్యార్థుల తరపున లాయర్ల వాదనలను విన్న ధర్మాసనం గురువారం విచారణకు ముగింపు పలికింది. పాఠశాలల్లో, కళాశాలల్లో హిజాబ్ వస్త్ర ధారణపై కర్ణాటక ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. హిజాబ్ అనేది ఇస్లామ్‌కి సంబంధించి తప్పనిసరి మత సంప్రదాయం కాదని హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ముస్లిం విద్యార్థినులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు ఎట్టకేలకు విచారణ ముగించింది. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధులియాలు పిటిషన్ల తరపు వాదనలను ముగించి తీర్పును రిజర్వ్ చేశారు.

విద్యా సంస్థల్లో ప్రభుత్వం నిర్దేశించిన యూనిఫాం‌లను మాత్రమే ధరించి, క్రమశిక్షణ పాటించవలసిందిగా ఆదేశించే హక్కు తనకు ఉందని కర్ణాటక ప్రభుత్వం అపెక్స్ కోర్టులో వాదించింది. తన ఆదేశం మతపరమమైన తటస్థతను పాటించిందని, విద్యార్థుల మధ్య వస్త్రధారణ విషయంలో వ్యత్యాసం చూపలేదని పేర్కొంది. ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరింత ముందుకెళ్లి, హిజాబ్ వివాదం సోషల్ మీడియాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రెచ్చగొట్టిన వివాదమే తప్ప మరేమీ కాదని వాదించారు.

అయితే తామేమి ధరించాలి, ఏ విశ్వాసాలను పాటించాలి అనేది విద్యార్ధినులకు రాజ్యాంగపరంగా లభించిన హక్కు అని, దాన్ని క్లాస్ రూమ్ లోపల హరించకూడదని విద్యార్థినుల తరపున సీనియర్ లాయర్ దుష్యంత్ దవే వాదించారు. ముస్లిం విద్యార్థినుల మత స్వాతంత్ర్యంపై ఆంక్షలు విధించే విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క కారణాన్ని కూడా చూపలేకపోయిందని పిటిషనర్ల తరపు లాయర్లు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.


Next Story