కర్ణాటకలో స్తంభించిన జనజీవనం.. వందకుపైగా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్

by Disha Web Desk 17 |
కర్ణాటకలో స్తంభించిన జనజీవనం.. వందకుపైగా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్
X

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ రైతు సంఘాలు శుక్రవారం రాష్ట్ర బంద్ నిర్వహించాయి. బంద్‌కు మద్దతుగా హోటళ్లు, విద్యా, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. ట్యాక్సీలు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బంద్‌ ప్రభావంతో చాలామంది ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్‌ చేసుకోవడంతో బెంగళూరు విమానాశ్రయంలో 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి.

కర్ణాటక రక్షణ వేదిక, జయ కర్ణాటక సంఘం, ఇతర కన్నడ సంఘాలు, రైతు సంఘం, హసిరుసేన, చెరకు సాగు దారుల సంఘం, ట్యాక్సీ ఆటో రిక్షా సంఘాలు, కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి, సినిమా కళాకారుల సంఘం తదితర వందకుపైగా సంఘాలు సంయుక్తంగా ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల ఆందోళనకారులు నిరసన తెలిపారు. 100 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బంద్ దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ఈ బంద్‌ కారణంగా కర్ణాటక రాష్ట్ర ఖజానాకు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మరోవైపు కన్నడ సంఘాలకు వ్యతిరేకంగా తమిళనాడులోనూ కొన్ని చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Next Story