ఫ్యాన్స్‌తో కలిసి రేణుకాస్వామిని హత్య చేసిన దర్శన్ ?

by Shamantha N |
ఫ్యాన్స్‌తో కలిసి రేణుకాస్వామిని హత్య చేసిన దర్శన్ ?
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీపా అరెస్టు కేసుతో ముడిపడిన సంచలన విషయాలు ఒక్కటొక్కటిగా బయటికొస్తున్నాయి. ఈ హత్య కేసు వివరాలు క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపిస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. గత కొంతకాలంగా భార్యకు దూరంగా ఉంటున్న దర్శన్.. కన్నడ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తున్నాడు. అయితే దర్శన్ ఫ్యాన్ రేణుకాస్వామికి ఈ విషయం నచ్చలేదు. నటి పవిత్ర తన సోషల్ మీడియా ఖాతాలో దర్శన్‌తో కలిసి ఉన్న ఫొటోలను పోస్టు చేశారు. వాటిని చూసి కోపంతో ఊగిపోయిన రేణుకాస్వామి అసభ్యకర కామెంట్లు చేశారు. పవిత్ర వల్లే దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటున్నారని, ఆయన్ని వదిలేసి వెళ్లిపోవాలని వరుస పోస్టులు పెట్టాడు. ఈ విషయాన్ని దర్శన్ దృష్టికి పవిత్ర తీసుకెళ్లింది. దీంతో కోపోద్రిక్తుడైన దర్శన్.. తన ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులతో కలిసి రేణుకాస్వామిని బెంగళూరుకు తీసుకొచ్చాడు. ఆర్ఆర్ నగర్‌లోని ఓ షెడ్‌లో రేణుకాస్వామిని దారుణంగా కొట్టి చంపారు. రేణుకాస్వామిని బెల్టుతో దర్శన్ కొట్టినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రేణుకాస్వామి స్పృహ తప్పి పడిపోయాక.. దర్శన్ సహచరులు కర్రలతో కొట్టారని తెలిపారు. తలను గోడకేసి కొట్టడంతో రేణుకాస్వామి చనిపోయాడని నిర్ధారించారు.

నిందితులకు వారం రోజుల కస్టడీ

రేణుకాస్వామి డెడ్ బాడీని జూన్ 9న మురికి కాల్వలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ గుర్తించాడు. డెడ్ బాడీపై గాయాలను గుర్తించిన పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. జూన్ 10న హత్య తామే చేసినట్లు ఇద్దరు వ్యక్తులు కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ కు వచ్చారు. వారిద్దరి కాల్ రికార్డులను పరిశీలించిన పోలీసులు.. ఈ కేసుతో దర్శన్, పవిత్రకు కూడా సంబంధం ఉందని తేల్చారు. సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌‌ సమాచారాన్ని సేకరించి విశ్లేషించిన పోలీసులు.. హత్య జరిగిన టైంలో అక్కడే దర్శన్‌, పవిత్ర గౌడ కూడా ఉన్నారని తేల్చారు. దీంతో దర్శన్, పవిత్రలను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో 11 మంది నిందితులను కోర్టు వారం రోజుల పోలీసు కస్టడీకి పంపింది. నిందితులందరి ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర వెల్లడించారు.Next Story

Most Viewed