బీజేపీలోకి కమల్‌నాథ్!: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ

by Dishanational2 |
బీజేపీలోకి కమల్‌నాథ్!: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడారు. దీంతో ఆ పార్టీకి వరుస షాక్‌లు తగిలాయి. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్‌లోనూ మరో భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, రాష్ట్ర పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ పార్టీని వీడనున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన కుమారుడు ఎంపీ నకుల్‌నాథ్‌తో కలిసి కమల్ నాథ్ కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. కొద్ది రోజులుగా ఈ కథనాలు వెలువడుతున్నప్పటికీ తాజాగా.. నకుల్ నాథ్ తన ఎక్స్ ఐడీలో కాంగ్రెస్‌ను తీసివేశారు. దీంతో తండ్రీ కొడుకులిద్దరూ బీజేపీలోకి వెళ్లడం దాదాపు ఖాయమైందనే వార్తలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కమల్‌నాథ్, నకుల్ నాథ్‌లు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. పలువురు ఎమ్మెల్యేలు కూడా వారితో పాటు వెళ్లనున్నట్టు సమాచారం. ఒక వేళ కమల్ నాథ్ బీజేపీలోకి వెళ్తే.. లోక్‌సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌కు ఇది భారీ ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. కాగా, అయోధ్యలోని రామమందిర వేడుకకు పార్టీ ఆహ్వానాన్ని తిరస్కరించడంతో కలత చెందిన ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలకు పార్టీ తలుపులు తెరిచి ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ శుక్రవారం వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే కమల్‌నాథ్ పార్టీని వీడటంపై కథనాలు రావడం గమనార్హం. అయితే రాష్ట్ర నేత అశోక్ సింగ్‌ను రాజ్యసభకు కాంగ్రెస్ నామినేట్ చేయడానికి ముందు పార్టీ నాయకత్వం తనను సంప్రదించకపోవడంతో కమల్ నాథ్ మనస్తాపానికి గురైనట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఊహాగానాలు మాత్రమే : దిగ్విజయ్ సింగ్

సీనియర్ నేత కమల్‌నాథ్ పార్టీని వీడటంపై వస్తున్న ఊహాగానాలను కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ కొట్టి పారేశారు. ‘కమల్‌నాథ్ బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం.. కేవలం మీడియాలో వస్తున్న కథనాలు మాత్రమే. కమల్‌నాథ్ గాంధీ కుటుంబంతో కెరీర్ ప్రారంభించారు. ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసే ఉన్నాడు. గాంధీ కుటుంబంతో కమల్‌నాథ్‌కి అవినాభావ సంబంధం ఉంది. జన్‌సంఘ్ పార్టీ ఇంధిరా గాంధీని జైల్లో పెట్టబోయే టైంలోనూ పార్టీకి అండగా నిలిచారు’ కమల్‌నాథ్‌ బీజేపీలో చేరతారని అనుకోవడం లేదని వెల్లడించారు. ఇదిలా ఉండగా..రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా కమల్‌నాథ్‌, నకుల్‌నాథ్‌ల ఫొటోను పోస్ట్‌ చేస్తూ జై శ్రీరామ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా, ఇటీవలే రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దినేష్ అహిర్వార్, విదిశకు చెందిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాకేష్ కటారే పార్టీని వీడి బీజేపీలో చేరారు.



Next Story

Most Viewed