విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ భరణం కోరవచ్చు: సుప్రీంకోర్టు

by S Gopi |
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ భరణం కోరవచ్చు: సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే అంశానికి సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించింది. గృహిణులు పోషించే పాత్ర, కుటుంబం కోసం వారు చేసే త్యాగాలను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం తన భర్త నుంచి భరణం కోరవచ్చని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. భరణం కోరే హక్కు మతంతో సంబంధం లేకుండా వివాహిత మహిళలందరికీ వర్తిస్తుంది. భరణం హక్కును కల్పించే సీఆర్‌పీసీ సెక్షన్‌ 125 విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపజేస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా.. భర్తలు తమ భార్యలకు ఆర్థిక సహాయం అందించడం చాలా అవసరం. అందులో భాగంగా జాయింట్ బ్యాంకు ఖాతాలను నిర్వహించడం, ఏటీఎం యాక్సెస్‌ను పంచుకోవడం లాంటి చర్యలు ఉండాలని కోర్టు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed