హేమంత్ సోరెన్‌పై జేఎంఎం ఎమ్మెల్యే తిరుగుబాటు స్వరం.. సంచలన వ్యాఖ్యలు

by Dishanational4 |
హేమంత్ సోరెన్‌పై జేఎంఎం ఎమ్మెల్యే తిరుగుబాటు స్వరం.. సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్‌లో సోమవారం రోజు(ఫిబ్రవరి 5న) విశ్వాస పరీక్ష జరగనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 47 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని హేమంత్ సోరెన్‌కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సంకీర్ణ కూటమి అంటోంది. హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో తదుపరి సీఎంగా ప్రమాణం చేసిన చంపై సోరెన్‌ వెంట 47 మంది ఎమ్మెల్యేలు నిలుస్తారని చెబుతోంది. అయితే విశ్వాస పరీక్షకు సరిగ్గా ఒకరోజు ముందు(ఆదివారం) మాజీ సీఎం హేమంత్ సోరెన్‌పై జేఎంఎంకు చెందిన ఎమ్మెల్యే లోబిన్ హెంబ్రోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సలహాను పట్టించుకోకపోవడం వల్లే .. హేమంత్ సోరెన్ జైలు పాలయ్యారని కామెంట్ చేశారు. సాహిబ్‌గంజ్ జిల్లాలోని బోరియో స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హెంబ్రోమ్ మాట్లాడుతూ.. ‘‘2019 అసెంబ్లీ ఎన్నికల వేళ చోటా నాగ్‌పూర్ టెనన్సీ యాక్ట్, సంతాల్ పరగణాల టెనన్సీ యాక్ట్ అమలు చేస్తామని జేఎంఎం మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. గిరిజనుల భూమి హక్కును కాపాడుతామని మాటిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక వాటి అమలును హేమంత్ సోరెన్ మర్చిపోయారు. పంచాయతీ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం-1996 అనే కేంద్ర చట్టం కూడా అమలుకు నోచుకోలేదు. ఇలా ప్రతీ హామీని హేమంత్ విస్మరించారు’’ అని విమర్శించారు. హేమంత్ సోరెన్ వైఖరి వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో తాము ‘జార్ఖండ్ బచావో మోర్చా’ అనే పోరాట వేదికను ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు.

ఒక్కరొక్కరుగా జైలుకు వెళ్తున్నారు..

‘‘గిరిజనుల భూముల వ్యవహారంలో చాలా అక్రమాలు జరిగాయి. కొందరు ఐఏఎస్ అధికారుల ప్రమేయం కూడా ఉంది. చోటా నాగ్‌పూర్ టెనన్సీ యాక్ట్‌ను అమలు చేయకపోవడంతో ఇదంతా జరిగింది. ఇప్పుడు ఒక్కరొక్కరుగా జైలుకు వెళ్తున్నారు. ఆఖరికి మన మాజీ ముఖ్యమంత్రిని(హేమంత్ సోరెన్) కూడా జైలుకు తీసుకెళ్లారు’’ అని జేఎంఎం ఎమ్మెల్యే లోబిన్ హెంబ్రోమ్ కీలక కామెంట్ చేశారు. త్వరలోనే జేఎంఎం నుంచి హేంబ్రోమ్ వైదొలుగుతారనే ప్రచారం నడుమ పార్టీ చీఫ్ హేమంత్ సోరెన్ ఆదేశాల మేరకు కీలక నేతలు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే లోబిన్ హెంబ్రోమ్‌‌తో చర్చలు జరిపి బుజ్జగించేందుకు యత్నించారు. ఇలాంటి కష్టకాలంలో జేఎంఎంకు అండగా నిలవాలని కోరారు. అయితే తాను పెట్టే ఆరు షరతులకు అంగీకారం తెలిపితే.. పార్టీకి అనుకూలంగా విశ్వాస పరీక్షలో ఓటువేస్తానని హెంబ్రోమ్ స్పష్టం చేశారు. మద్యం అమ్మకాలను నిషేధించడం, అడవుల సంరక్షణ, నీటి సంరక్షణ, చోటా నాగ్‌పూర్ టెనెన్సీ (CNT) యాక్ట్ అమలు, సంతాల్ పరగణ టెనెన్సీ (SPT) యాక్ట్ అమలు వంటివి ఆయన షరతుల్లో ఉన్నాయి. గ్రామసభల ఆమోదం లేకుండా రాష్ట్ర సర్కారు లేదా కేంద్ర ప్రభుత్వం గిరిజనుల భూమిని సేకరించకూడదని ఎమ్మెల్యే హెంబ్రోమ్‌‌ డిమాండ్ చేశారు. గిరిజనులపై దాఖలైన కేసుల వేగవంతమైన విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.



Next Story

Most Viewed