జైన ధర్మకర్త ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కన్నుమూత.. సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని

by Harish |
జైన ధర్మకర్త ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కన్నుమూత.. సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ జైన ధర్మకర్త ఆచార్య విద్యాసాగర్ మహారాజ్(77 ఏళ్లు) ఆదివారం కన్నుమూశారు. చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని డోంగర్‌ఘర్‌లో ఉన్నటువంటి చంద్రగిరి తీర్థంలో ఆదివారం తెల్లవారుజామున 2:35 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన సన్నిహితులు ప్రకటించారు. ఆయన ఆరు నెలలుగా డోంగర్‌ఘర్‌లో తీర్థంలో ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. జైనమత ఆచారంలో ‘సల్లేఖన’ను ఆచరిస్తున్నారు. మూడు రోజులుగా ఆహారం తీసుకోవడం మానేశారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రజల కోసం ఊరేగింపు నిర్వహించి, చంద్రగిరి తీర్థంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు తెలిపారు.


గత ఏడాది చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన డోంగర్‌ఘర్‌ను సందర్శించి, నవంబర్ 5న ఆచార్య విద్యాసాగర్ మహారాజ్‌ను కలుసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన మృతిపై ప్రధాని మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ లో సమాజానికి మహరాజ్ అమూల్యమైన సేవలు అందించారు. ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం మొదలగు వాటి కోసం ఆయన కృషి రాబోయే తరాలకు గుర్తుండిపోతుందని అన్నారు. గత ఏడాది జైన మందిరాన్ని సందర్శించి ఆయన ఆశీస్సులు అందుకోవడం నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మరణం దేశానికి తీరని లోటు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


ఆయన మరణంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ పార్టీ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ 1946 అక్టోబర్ 10న కర్ణాటకలో జన్మించారు. జైన మత ఆచార్యులలో ప్రముఖ ధర్మకర్తగా ఉన్నారు.

Next Story