జూన్ 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..!

by Harish |
జూన్ 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో, ఆదివారం ప్రధానిగా మోడీతో పాటు కొత్త కేంద్ర మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో 18వ లోక్‌సభ కార్యకలాపాలను ప్రారంభించడానికి కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను జూన్ 24 నుంచి జులై 3 వరకు నిర్వహించనున్నట్లు సమాచారం. జూన్ 24, 25 తేదీల్లో కొత్త పార్లమెంట్ సభ్యులు ప్రమాణస్వీకారం ఉంటుందని తెలుస్తుంది. ఆ తరువాత ఎంపీలందరు కలిసి జూన్ 26న లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఈ సారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించకపోవడంతో ఎన్డీయే మిత్ర పక్షాలైన టీడీపీ, జేడీయూ మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకుంది. కేంద్రంలో బీజేపీ తన అధికారాన్ని కాపాడుకోవాలంటే ఈ రెండు పార్టీల మద్దతు చాలా ముఖ్యం. దీంతో లోక్‌సభ స్పీకర్ పదవి కోసం ఈ రెండు పార్టీలు కూడా బీజేపీపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. రాజస్థాన్‌ కోటా స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తుంది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పురందేశ్వరి పేరు కూడా ప్రచారంలో ఉంది. దీనిపై పూర్తి స్పష్టత కొరవడింది. ఏడోసారి తిరిగి ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు రాధా మోహన్ సింగ్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకోవచ్చని తెలుస్తుంది.

రాష్ట్రపతి జూన్ 27న సభను ఉద్దేశించి ప్రసంగిస్తారని, జులై 3న ఆర్థిక సర్వే ప్రవేశపెట్టి, పూర్తి బడ్జెట్‌ను జులై 22న సమర్పించే అవకాశం ఉందని సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను అధికార బీజేపీ సమర్పించగా, ఇప్పుడు కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ఆర్థిక మంత్రిగా తిరిగి నియమితులైన నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపట్టనున్నారు.



Next Story

Most Viewed