ఎన్నికల బరిలో ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు.. రిజల్ట్ ఇదీ

by Hajipasha |
ఎన్నికల బరిలో ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు.. రిజల్ట్ ఇదీ
X

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్ జీత్ సింగ్ ఖల్సా లోక్‌సభ ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. ఆయన పంజాబ్‌లోని ఫరీద్ కోట్ స్థానంలో తన సమీప ప్రత్యర్థిగా ఉన్న ఆప్ అభ్యర్థి కరమ్‌జిత్ సింగ్ అన్మోల్‌పై 51వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫరీద్‌కోట్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సరబ్‌జీత్ సింగ్ ఖల్సా బరిలోకి దిగారు. ఇండిపెండెంట్‌గా పోటీలో నిలిచినప్పటికీ ప్రజల నుంచి బలమైన మద్దతును సాధించడంలో సరబ్‌జీత్ సింగ్ సఫలం కావడం గమనార్హం. ఖలిస్తాన్ వేర్పాటు వాది అమృత్‌పాల్ సింగ్‌ కూడా ఈ ఎన్నికల్లో స్వతంత్రుడిగా బరిలో దిగి లీడ్‌లో కొనసాగుతున్నారు. పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి పోటీచేస్తున్న ఆయనకు ఇప్పటివరకు 190416 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరా రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు ఇప్పటిదాకా 116317 ఓట్లు దక్కాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి లల్జిత్ సింగ్ భుల్లర్‌కు 99318 ఓట్లు వచ్చాయి. ఇక పంజాబ్‌లో కాంగ్రెస్ ఆరు స్థానాల్లో, ఆప్ మూడు స్థానాల్లో, శిరోమణి అకాలీదళ్ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed