అంతర్జాతీయ ట్రాక్‌లపై వందేభారత్ రైళ్లు

by Dishanational1 |
అంతర్జాతీయ ట్రాక్‌లపై వందేభారత్ రైళ్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ట్రాక్‌లపై వేగంగా పరుగులు పెడుతున్న కొత్త వందేభారత్‌ రైళ్లు భవిష్యత్తులో అంతర్జాతీయ ట్రాక్‌లపై కూడా నడవనున్నాయి. ఈ మేరకు వందేభారత్‌ రైళ్లను ఎగుమతి చేసే ప్రణాళికపై భారత్ కసరత్తు చేస్తోందని గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇప్పటికే భారతీయ రైల్వేకు పలు దేశాల నుంచి సమాచారం కోసం ఎంక్వైరీలు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. స్వదేశీ డిజైన్లు, ప్రమాణాలతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ యూనిట్లలోనే కాకుండా సొంత వర్క్‌షాప్‌లలో విడిభాగాలను తయారు చేసేందుకు తగిన సామర్థ్యాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేస్తోందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వందేభారత్‌ను మన స్వంతంగా అభివృద్ధి చేయడమే సవాలు. ఇంజనీర్లు దీన్ని ఛాలెంజ్‌లా తీసుకున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ రైలును ఎగుమతి చేయడం ప్రారంభిస్తామనే విశ్వాసం ఉందన్నారు. దేశంలో ఇప్పటికే(జనవరి 31 నాటికి) వందేభారత్ రైళ్ల సంఖ్య 82కి పెరిగింది. న్యూఢిల్లీ-ముంబై, న్యూఢిల్లీ-హౌరా మార్గాల్లో ఈ రైళ్లు గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed