ఇండియా : ద మోడీ క్వశ్చన్ డాక్యుమెంటరీ.. అసలేంటీ వివాదం!

by Disha Web Desk 4 |
ఇండియా : ద మోడీ క్వశ్చన్ డాక్యుమెంటరీ.. అసలేంటీ వివాదం!
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఇండియా : ద మోడీ క్వశ్చన్ డాక్యుమెంటరీ చర్చనీయాంశంగా మారింది. రెండు దశాబ్దాల నాటి గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ మేరకు భారత దేశంలో ఈ డాక్యుమెంటరీని ఎవరూ చూడకుండా యూట్యూబ్, ట్విట్టర్లను కేంద్రం ఆదేశించింది.

గుజరాత్ అల్లర్ల వెనుక అప్పటి సీఎం, ప్రస్తుత ప్రధాని మోడీ ప్రత్యక్ష హస్తం ఉన్నదని చెబుతున్న ఈ డాక్యుమెంటరీ సంచలనంగా మారింది. ఫస్ట్ పార్ట్‌ను వారం కింద ఇండియాలో తప్ప మిగతా దేశాల్లో విడుదల చేసింది. ఇది పక్షపాతంతో అసత్య ప్రచారం చేసేలా ఉందంటూ కేంద్రం మండి పడింది.

ఇండియాలో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కాకపోయిన కొంత మంది వీటి లింకులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాచార సాంకేతిక నిబంధనల చట్టంలోని ఎమర్జెన్సీ అధికారాలను కేంద్రం ప్రయోగించి పలు ఆదేశాలు జారీ చేసింది. మోడీ ఆయన బృందానికి ఈ డాక్యుమెంటరీ ద్వారా నిజాలు వెలుగులోకి రావడం ఇష్టం లేనందునే ప్రభుత్వం నిషేధించిందని విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. బ్రిటీష్ ప్రభుత్వం అప్పట్లో నియమించిన ఒక కమిటీ సేకరించిన వివరాల ఆధారంగా దీనిని రూపొందించినట్లు బీబీసీ పేర్కొంది.

వైషమ్యాలు పెంచేలా ఉందంటూ..

దేశ ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు సుప్రీం కోర్టు విశ్వసనీయతను ప్రశ్నించేలా డాక్యుమెంటరీ ఉందని కేంద్రం వాదిస్తోంది. సమాజంలోని భిన్న వర్గాల మధ్య ఈ డాక్యుమెంటరీ వైషమ్యాలు పెంచేలా ఉందంటూ కేంద్రంలోని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతను ఈ డాక్యుమెంటరీ దెబ్బతీసేలా ఉందని కేంద్రం తెలిపింది.

కాగా బీబీసీ మాత్రం ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో భాగంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించామని అంటోంది. ఇందుకు గాను కీలక డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. అయితే ఈ అంశంపై ఇప్పటికే సుప్రీం కోర్టు మోడీ ప్రత్యక్ష ప్రమేయం లేదని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ వివాదాస్పద అంశాన్ని తెరపైకి తేవడం సరికాదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.

అయితే 2002 ఫిబ్రవరి 27న గోధ్రా రైలు దహనంలో 59 మంది మరణించగా తర్వాత గుజరాత్‌లో అల్లర్లు జరుగగా 2000కు పైగా మరణించి ఉంటారని అంచనా ఉంది. ఈ వివాదాస్పద అంశాలను ఊటంకిస్తూ బీబీసీ ఈ డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీబీసీ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం నిషేధించింది. కేంద్రం విదేశాంగ శాఖ దీనికి మద్దతుగా నిలిచింది. ఇలాంటి రాజకీయాలు అసహనాన్ని కలిగిస్తాయన్నారు. ఇదే అంశంపై ఇటీవల స్పందించిన ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ మాట్లాడుతూ.. బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రంలోని బీజేపీ నిషేధించినట్లే గాంధీ గాడ్సే ఏక్ యుద్ధ్ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు.

ఈ డాక్యుమెంటరీ వివాదాస్పదమవడంతో స్వతంత్ర దర్యాప్తు చేయాలని ఇటీవల యూకేలో ఆన్ లైన్ పిటిషన్ దాఖలైంది. గత వారం ప్రసారమైన మొదటి భాగంలో దుష్ప్రచారం ఎక్కువగా ఉందని, ఇది అనేక మందిని తప్పుదోవ పట్టించేలా ఉందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.


Next Story

Most Viewed