పాక్‌కు భారత్ షాక్.. రావి నదీజలాలకు ఫుల్ ‘స్టాప్’

by Dishanational4 |
పాక్‌కు భారత్ షాక్.. రావి నదీజలాలకు ఫుల్ ‘స్టాప్’
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ వైపుగా ప్రవహించే రావి నది జలాలపై తనకున్న ప్రత్యేక హక్కులను చాటి చెబుతూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక డ్యామ్‌ను నిర్మించి, రావి నది జలాలు పాకిస్తాన్ వైపు వెళ్లకుండా భారత్‌ నిలువరించింది.ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో 1960లో జరిగిన ‘ఇండస్ వాటర్ ట్రీటీ’ ప్రకారం ఈమేరకు చర్యలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి, సట్లెజ్, బియాస్ జలాలపై భారతదేశానికి పూర్తి హక్కులు ఉండగా.. సింధు, జీలం, చీనాబ్ జలాలపై పాకిస్తాన్‌కు హక్కులు ఉన్నాయి. జమ్ము కశ్మీర్, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన వివాదం కారణంగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో ఉన్న షాపూర్ కంది బ్యారేజీ నిర్మాణ పనులు చాలా ఏళ్లపాటు నిలిచిపోయాయి. ఫలితంగా గత కొన్నేళ్లుగా భారత్‌కు చెందిన రావి నదీజలాల్లో ఎక్కువ భాగం పాకిస్తాన్‌ వైపుగా ప్రవహిస్తూ వెళ్లిపోయాయి.

1979 నుంచి ఇప్పటివరకు ఇలా..

* పాకిస్తాన్‌కు రావి నదీ జలాలను ఆపడానికిగానూ 1979లో పంజాబ్, జమ్ము కశ్మీర్ ప్రభుత్వాలు రంజిత్ సాగర్ డ్యామ్‌తో పాటు దిగువన ఉన్న షాపూర్ కంది బ్యారేజీని నిర్మించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి.

* ఈ ఒప్పందంపై నాటి జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ మహ్మద్ అబ్దుల్లా, అప్పటి పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ సంతకం చేశారు.

* 1982లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1998 నాటికి దీనిని పూర్తి చేయాలని భావించారు. 2001లో రంజిత్ సాగర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాగా, షాపూర్ కంది బ్యారేజీని నిర్మించలేక పోవడంతో రావి నది నీరు పాకిస్తాన్‌లోకి ప్రవహిస్తూనే ఉంది.

* షాపూర్ కంది ప్రాజెక్టును 2008లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించగా, 2013లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

* పంజాబ్, కశ్మీర్ ప్రభుత్వాల మధ్య వివాదాల కారణంగా 2014లో ఈ ప్రాజెక్ట్ మళ్లీ ఆగిపోయింది.

* 2018లో కేంద్ర సర్కారు మధ్యవర్తిత్వంతో ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని తర్వాత డ్యాం పనులు ప్రారంభమై, ఎట్టకేలకు పూర్తయ్యాయి.

* రావి నది నీటిని ఇకపై జమ్మూ కాశ్మీర్‌లోని కథువా, సాంబా ప్రాంతాలలోని పంట పొలాలకు అందిస్తారు. రావి నది నుంచి ఇకపై 1,150 క్యూసెక్కుల సాగునీరు 32,000 హెక్టార్ల భూమికి అందనుంది. పంజాబ్‌, రాజస్థాన్‌లకు కూడా ఈ డ్యామ్‌ నీరు ఉపయోగపడుతుంది.



Next Story