టర్కీ - భారత్‌ కార్గో షిప్ హైజాక్

by srinivas |
టర్కీ - భారత్‌ కార్గో షిప్ హైజాక్
X

న్యూఢిల్లీ: టర్కీ నుంచి భారత్‌కు బయలుదేరిన కార్గో షిప్‌ను ఎర్ర సముద్రంలో యెమన్‌ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్లు హైజాక్ చేశారు. ఇందులో ఉక్రెనియన్, బల్గేరియన్, ఫిలిపినో, మెక్సికన్‌ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారు. ఓడలో భారతీయులు కానీ, ఇజ్రాయెలీలు కానీ ఎవరూ లేరు. ఈనేపథ్యంలో తామే ఇజ్రాయెలీ నౌకను హైజాక్ చేశామని హౌతీలు ప్రకటించారు. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం.. అది తమ నౌక కాదని స్పష్టం చేసింది. ఇరాన్ ఇచ్చిన గైడెన్స్ ప్రకారమే ఈ నౌకను హౌతీలు హైజాక్ చేశారని ఆరోపించింది. అంతర్జాతీయ నౌకపై జరిగిన ఈ దాడిని నెతన్యాహు కార్యాలయం ఖండించింది. బ్రిటీష్ కంపెనీకి చెందిన ఆ నౌకను ఒక జపాన్ సంస్థ లీజుపై నిర్వహిస్తోందని తెలిపింది. హైజాక్ చేసిన ఓడను యెమన్ తీరంలోని ఓడరేవు నగరం సలీఫ్‌కు తీసుకెళ్లారంటూ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

‘‘బహమన్ జెండాతో కూడిన ఈ ఓడ బ్రిటీష్ కంపెనీ పేరిట రిజిస్టర్ అయి ఉంది. ఈ కంపెనీలో పార్ట్నర్‌గా ఇజ్రాయెలీ ధనవంతుడు అబ్రహం ఉంగార్ ఉన్నారు’’ అని పేర్కొంటూ ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒక కథనాన్ని ప్రచురించింది. గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు జరుపుతున్నందుకు ప్రతీకారంగా సముద్రంలో రాకపోకలు సాగించే ఇజ్రాయెలీ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇటీవల ప్రకటించిన హౌతీ మిలిటెంట్లు తాజాగా ఈ దుశ్చర్యకు పాల్పడటం గమనార్హం.



Next Story

Most Viewed