ఫేస్‌బుక్, గూగుల్ సీఈవోలకు ‘ఇండియా’ లేఖ

by Disha Web Desk 12 |
ఫేస్‌బుక్, గూగుల్ సీఈవోలకు ‘ఇండియా’ లేఖ
X

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ ఆధీనంలో ఉన్న సామాజిక మాధ్యమాల పాత్ర తటస్థంగా ఉండేలా వ్యవహరించాలని కోరుతూ ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి లేఖ రాసింది. ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్‌ మాధ్యమాలు బీజేపీ పట్ల, ప్రధాని మోడీ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయంటూ యూఎస్‌కు చెందిన ‘వాషింగ్టన్ పోస్ట్’ అనే న్యూస్‌పేపర్‌లో ఇటీవలే ఓ కథనం వచ్చింది. ఈ కథనం వెలువడిన మరుసటి రోజే(బుధవారం) ‘ఇండియా’ కూటమి లేఖ రాసింది.

ఈ లేఖను కాంగ్రెస్ చీఫ్ ఖర్గే గురువారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఖర్గే, రాహుల్ గాంధీ, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, మెహబూబ ముఫ్తీ, హేమంత్ సొరెన్ సహా 14 మంది ‘ఇండియా’ కూటమి నేతల సంతకాలతో ఉన్న ఈ లేఖలో.. రానున్న ఎన్నికల్లో తటస్థ వైఖరిని అవలంభించాలని డిమాండ్ చేశారు. ‘‘మేము 28 రాజకీయ పార్టీలతో కూడిన ఇండియా కూటమి తరఫున లేఖ రాస్తున్నాం. మా కూటమిలోని పార్టీలు దాదాపు సగం మంది భారతీయ ఓటర్లకు ప్రాతినిధ్యం వహించే 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి.

అధికార బీజేపీ మత విద్వేష ప్రచారానికి సహాయం చేయడంలో వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ పాత్ర గురించి వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రికలో ఇటీవల వెలువడిన కథనం గురించి మీకు తెలిసే ఉంటుంది. బీజేపీ నేతలు, ఆ పార్టీ మద్దతుదారుల వాట్సప్ గ్రూపులు, యూట్యూబ్, ఫేస్‌బుక్ ద్వారా ఈ నీచమైన మత విద్వేషపూరిత ప్రచారం ఎలా జరుగుతుందో ఆ కథనం ఉదహరించింది. పాలక వ్యవస్థ పట్ల మీ మాధ్యమాల ఇండియా అధికారుల పక్షపాత వైఖరిని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సాక్ష్యాధారాలతో ప్రచురించింది. ప్రతిపక్షంలో ఉన్న మాకు ఈ విషయం చాలాకాలంగా తెలుసు. ఆ కథనంలోని సాక్ష్యాల ద్వారా భారత్‌లో మెటా సాంఘిక అసమానతను, మత విద్వేషాలను రెచ్చగొట్టడంలో దోషి అని స్పష్టంగా తెలుస్తోంది.

అలాగే, మీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రతిపక్ష నాయకుల కంటెంట్‌ను ఎక్కువ మందికి రీచ్‌ అవ్వకుండా అణచివేస్తున్నారనే డేటా మా వద్ద ఉంది. ఒక విదేశీ ప్రైవేట్ కంపెనీ ఒక రాజకీయ నిర్మాణం పట్ల ఇలాంటి కఠోరమైన పక్షపాతం, దేశ ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకోవడంతో సమానం. దీనిని మేం తేలికగా తీసుకోము. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, ఈ వాస్తవాలను తీవ్రంగా పరిగణించి, భారత్‌లో మెటా/గూగుల్ కార్యకలాపాలు తటస్థంగా ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నది మా అత్యవసర విజ్ఞప్తి’’ అంటూ లేఖలో పేర్కొన్నాయి.


Next Story

Most Viewed