జైల్లో సీఎం ఆఫీస్ ఏర్పాటు అసాధ్యం.. కానీ, ఇలా చేయొచ్చు: తిహార్ జైల్ మాజీ పీఆర్వో

by Dishanational5 |
జైల్లో సీఎం ఆఫీస్ ఏర్పాటు అసాధ్యం.. కానీ, ఇలా చేయొచ్చు: తిహార్ జైల్ మాజీ పీఆర్వో
X

దిశ, నేషనల్ బ్యూరో: జైల్లో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు చేయడం ఎంతమాత్రమూ సాధ్యమయ్యే పనికాదని, అందుకోసం జైలు నిబంధనలన్నీ ఉల్లంఘించాల్సి వస్తుందని తిహార్ జైలు మాజీ పీఆర్వో సునీల్ కుమార్ గుప్తా వెల్లడించారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు.. రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు కేజ్రీవాల్‌ను తిహార్ జైలుకు తరలించారు. కేజ్రీవాల్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్నప్పటికీ నుంచే తమ చీఫ్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోరని ఆప్ లీడర్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే దీనిపై సునీల్ కుమార్ సోమవారం స్పందించారు. ‘‘జైల్లో సీఎం ఆఫీస్ ఏర్పాటు చేయడం సవాల్‌తో కూడుకున్నది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడమంటే కేవలం ఫైళ్లపై సంతకాలు పెట్టడమే కాదు. కేబినెట్ సమావేశాలు నిర్వహించాలి. మంత్రులను కలుస్తూ ఉండాలి. అనేక మంది సిబ్బంది ఉంటారు. లెఫ్టినెంట్ గవర్నర్‌తో మీటింగ్‌లు, ఫోన్ సంభాషణలు ఉంటాయి. జైల్లో టెలిఫోన్ సౌకర్యం ఉండదు. తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు సీఎంను కలుస్తూ ఉంటారు. ఫలితంగా అనేక భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఇన్ని ఏర్పాట్లు చేయాలంటే జైలు నిబంధలన్నింటినీ ఉల్లంఘించాల్సిందే. ఇందుకు ఎవరూ అనుమతించరు. కాబట్టి, జైల్లో సీఎం కార్యాలయం ఏర్పాటు చేయడం అసాధ్యం. అలా చేయాలంటే, పలు షరతులకు లోబడి ఇంటిని, లేదా ఆఫీసునే జైలుగా మార్చి పాలనను కొనసాగించవచ్చు’’ అని సునీల్ కుమార్ గుప్తా వెల్లడించారు.



Next Story

Most Viewed