మహారాష్ట్ర బిజినెస్ మ్యాన్ ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.58కోట్ల నగదు స్వాధీనం

by Disha Web |
మహారాష్ట్ర బిజినెస్ మ్యాన్ ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.58కోట్ల నగదు స్వాధీనం
X

ముంబై: మహారాష్ట్ర జల్నాలో ఓ వ్యాపారవేత్త ఇంట్లో నిర్వహించిన ఐటీ సోదాల్లో భారీ ఎత్తున నగదు గుర్తించారు. వారం రోజుల పాటు కొనసాగిన తనిఖీల్లో రూ.58 కోట్ల నగదు, 32 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గురువారం అధికారులు వెల్లడించారు. సుమారు 13 గంటల పాటు డబ్బు లెక్కింపు కొనసాగిందని తెలిపారు. 260 మంది ఐటీ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. దీని కోసం కేంద్ర సంస్థ 120 వాహానాలను ఉపయోగించినట్లు వెల్లడించారు. డబ్బు లెక్కింపు కోసం 12 కౌంటింగ్ మెషిన్లను ఉపయోగించారు. డబ్బు కుప్పలు, కుప్పలుగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న డబ్బును సమీపంలో బ్యాంకులో లెక్కింపు చేశారు. కాగా, వ్యాపార వేత్త ఆభరాణాలు, రియల్ ఎస్టేట్, స్టీల్ బిజినెస్‌లో ఉన్నాడు.

నాలుగు ఉక్కు కంపెనీల ఖాతాల్లో అక్రమాలు జరిగాయని ఐటీ శాఖకు పక్కా సమాచారం అందడంతో ఈ బృందాలు రంగంలోకి దిగినట్లు పేర్కొన్నారు. ముందుగా వ్యాపారవేత్తకు చెందిన ఫ్యాక్టరీలలో సోదాలు చేయగా ఏమి లభించలేదని, అయితే ఫాంహౌజ్‌లో నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున డబ్బు, విలువైన వస్తువులు గుర్తించినట్లు తెలిపారు. కప్ బోర్డులు, బెడ్లు, బ్యాగులలో డబ్బు దాచినట్లు చెప్పారు. రూ.390 కోట్ల మేర లెక్కల్లో లేని ఆస్తులను గుర్తించారు. సోదాలకు ముందు రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ నెల 1 నుంచి 8వరకు సోదాలు చేసినట్లు తెలిపారు.

Next Story