ఇన్సులిన్, మామిడి పండ్లు, స్వీట్లు.. కోర్టులో సీఎం కేజ్రీవాల్ వర్సెస్ ఈడీ

by Dishanational4 |
ఇన్సులిన్, మామిడి పండ్లు, స్వీట్లు.. కోర్టులో సీఎం కేజ్రీవాల్ వర్సెస్ ఈడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : తన ఆరోగ్యంతో ఈడీ చెలగాటం ఆడుతోందని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తన ప్రాణాలను నిలిపేందుకు అత్యవసరమైన ఇన్సులిన్ మెడిసిన్ గత 29 రోజులుగా అందకుండా ఈడీ అడ్డుకుందని ఆయన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. 2012 సంవత్సరం నుంచి తాను ప్రతిరోజూ ఉదయం 28 యూనిట్ల ఇన్సులిన్, రాత్రి 22 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటున్నానని కేజ్రీవాల్ చెప్పారు. షుగర్ లెవల్స్ డౌన్ అవుతున్నందున వారానికి మూడు రోజులు 15 నిమిషాలు చొప్పున పర్సనల్ డాక్టర్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతి కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం కూడా విచారణ కొనసాగింది. ఈడీ వాదనలు వినిపిస్తూ.. ‘‘న్యాయవాదులతో ములాకాత్ అయ్యేందుకు ఇచ్చిన అవకాశాన్ని కూడా కేజ్రీవాల్ దుర్వినియోగం చేశారు. దీనిపై కోర్టు ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు డాక్టర్‌తో ములాకాత్ అంటే ఎలా ? ’’ అని పేర్కొంది. బెయిల్ పొందేందుకే తాను మామిడిపండ్లు, స్వీట్లను తింటున్నానంటూ ఈడీ చేసిన ఆరోపణలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఖండించారు. ‘‘పక్షవాతం వచ్చేలా.. తన ప్రాణాలను కేజ్రీవాల్ రిస్కులో పెట్టుకుంటారా ? ’’ అని ఆయన ఈడీని ప్రశ్నించారు.

‘‘కేజ్రీవాల్‌కు ఇంటి నుంచి 48 సార్లు మీల్స్ వచ్చాయి. కేవలం మూడుసార్లే మీల్స్‌తో పాటు మామిడి పండ్లను పంపారు. ఏప్రిల్ 8 తర్వాత మామిడి పండ్లను అస్సలు పంపలేదు. జైలులో ఆరుసార్లే స్వీట్లు తిన్నారు’’ అని కోర్టుకు కేజ్రీవాల్ లాయర్ వివరించారు. ‘‘మామిడి పండ్లను ఈడీ భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి వాటి కంటే గోధుమలు, బియ్యంలోనే ఎక్కువ మోతాదులో షుగర్ లెవల్ ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘కేజ్రీవాల్ టీలో తెల్ల చక్కెరను వాడుతున్నారని ఈడీ చేస్తున్న ఆరోపణ అవాస్తవం. ఆయన టీలో రోజూ షుగర్ ఫ్రీ (ప్రసిద్ధ కృత్రిమ చక్కెర)ని మాత్రమే వాడుతుంటారు’’ అని అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును సోమవారానికి రిజర్వ్‌ చేసింది.

Next Story