నేతాజీ సిద్ధాంతాలను అనుసరిస్తే దేశకీర్తి మరింత పెరిగేది : Narendra Modi

by Disha Web |
నేతాజీ సిద్ధాంతాలను అనుసరిస్తే దేశకీర్తి మరింత పెరిగేది : Narendra Modi
X

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. నేతాజీ సిద్ధాంతాలను అనుసరించి ఉంటే దేశం కీర్తి మరింతగా పెరిగేదని అన్నారు. గురువారం ఆయన దేశరాజధానిలో ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ 28 అడుగుల విగ్రహాన్ని అవిష్కరించారు. దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం తర్వాత గొప్ప హీరోను దేశం మరిచిపోయిందని, ఆయన గుర్తులు, అభిప్రాయాలను విస్మరించామని మోడీ చెప్పారు. నేతాజీని ప్రపంచ మొత్తం నాయకుడిగా స్వీకరించిందని చెప్పారు. ఆయన ఆలోచనలు, సామర్ధ్యం, విధానాలు దానికి కారణమని పేర్కొన్నారు. 1947కి ముందే అండమాన్‌ను విముక్తి చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అఖండ భారత్ తొలి ప్రధాని నేతాజీ సుభాష్ అని మోడీ తెలిపారు. కాగా 280 టన్నుల బరువున్న ఈ విగ్రహాన్ని తయారుచేసేందుకు శిల్పకారులు 26,000 గంటలకు పైగా కష్టపడ్డారు.

రాజ్‌పథ్ ముగిసిన చరిత్రే..

విగ్రహావిష్కరణ తర్వాత సెంట్రల్ విస్టా ఎవెన్యూ‌తో పాటు కర్తవ్య‌పథ్ మార్గాన్ని అవిష్కరించారు. రాజ్‌పథ్ ఇక తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు. కొత్త చరిత్ర మొదలైందని, మరో బ్రిటిష్ రాజ్ స్మారకాల నుంచి విముక్తి లభించిందని చెప్పారు. కింగ్స్ వే(రాజ్‌పథ్) బానిసత్వానికి గుర్తు అని, నేటితో అది తుడిచిపెట్టుకు పోయిందని అన్నారు. రాజ్ పథ్ బ్రిటిష్ వారికి చెందిందని, దేశం నూతన సిద్ధాంతాలతో నూతన విధానాలతో దూసుకుపోతుందని చెప్పారు. బ్రిటిష్ కాలం నాటి వందల చట్టాలను దేశం మార్చివేసిందని తెలిపారు. నూతన విద్యా విధానంతో దేశ యువతకు విదేశీ భాషా ఒత్తిడి తగ్గిందని పేర్కొన్నారు. కాగా, ఈ సందర్భంగా రాజధానిలోని చారిత్రక నిర్మాణాలు, ప్రముఖ స్థలాల్లో త్రివర్ణ రంగుతో లైటింగ్ ఏర్పాటు చేశారు. సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టులో విక్రయదారులకు కేటాయింపులు చేసేలా రూపొందించారు. అంతేకాకుండా పోలీసు భద్రత కూడా మోహరించనుంది. సెంట్రల్ వీస్టా నిర్మాణ కార్మికులకు కీలక హామీ ఇచ్చారు. నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి ప్రధాన అతిథులుగా అహ్వానిస్తామని పేర్కొన్నారు.


Next Story