ఫ్లూ డేంజర్ బెల్స్: రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

by Disha Web Desk 2 |
ఫ్లూ డేంజర్ బెల్స్: రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో హెచ్3ఎన్2 వైరస్ ఇన్‌ఫ్లుయెంజా వేగంగా వ్యాపిస్తుంది. హెచ్3ఎన్2 వైరస్‌ సోకి హర్యానాలో తొలి మరణం సంభవించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అదే వైరస్ భారిన పడి కర్ణాటకలో మరొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ధృవీకరించారు. ఈ వైరస్ కారణంగా ఇన్‌ఫ్లూయెంజా బారినపడ్డ వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 90 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. వాటితో పాటు 8 హెచ్1ఎన్1 వైరస్ కేసులు కూడా వైద్యులు కనుగొన్నారు.

ఈ కొత్త వైరస్ సోకిన వారిలో జ్వరం, వణుకు, దగ్గు, శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకునేటపుడు శబ్దాలు రావడం తదితర లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటికి అదనంగా వాంతి వచ్చినట్లు అనిపించడం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, డయేరియా తదితర లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. మిగతా అనారోగ్యాల బారినపడ్డ వారిలోనూ ఈ లక్షణాలు కనిపించవచ్చని, అయితే వారంపైగా ఈ లక్షణాలు ఉంటే అనుమానించాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.

లక్షణాలు ఉన్న పిల్లల్ని స్కూల్‌కి పంపొద్దు...

హెచ్3ఎన్2 వైరస్‌ విషయంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. విశాఖపట్నంలో ఈ వైరస్‌ ప్రభావం కనిపిస్తోంది ఏపీ వైద్యశాఖ ప్రకటించింది. ఈ లక్షణాలతో ఉన్న పిల్లల్ని స్కూళ్లకి పంపొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశించారు. కాగా, కరోనా వైరస్ సృష్టించిన బీభత్సం మరువకముందే మరో మాయదారి వైరస్ ప్రజలపై దండెత్తడానికి వస్తోంది. హెచ్3ఎన్2 ఇన్‌ప్లూయెంజా ఫ్లూ బారిన పడుతోన్న వారి సంఖ్య దేశంలో వేగంగా పెరిగిపోతోంది. సాధారణ జ్వరం, జలుబుగా మొదలైన ఈ వ్యాధి మనిషి ప్రాణాలను బలితీసుకునే స్థాయికి చేరుకుంది. వైరస్‌ కారణంగా దేశంలో ఇద్దరు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది.



Next Story

Most Viewed