భయపెడుతున్న ‘H3N2’.. వేగంగా విస్తరిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా

by Vinod kumar |
భయపెడుతున్న ‘H3N2’.. వేగంగా విస్తరిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని సంతోషించేలోపే మరో వైరస్ దేశ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో గత నెల నుంచి ప్రతి ఇద్దరిలో ఒకరు దీర్ఘకాలంపాటు దగ్గు, శ్వాస ఆడకపోవడం, తుమ్ములు వంటి సమస్యతో సతమతమవుతున్నారు. ఈ విషయాన్ని మ్యాక్స్ హెల్త్‌కేర్ గ్రూప్ డైరెక్టర్, ఇంటర్నల్ మెడిసిన్ ఇనిస్టిట్యూట్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ బుధిరాజా వెల్లడించారు. దీనికి ‘H3N2’ అనే వైరస్ కారణమని తెలిపారు. ఈ వైరస్‌పై వైద్య అధికారులు, ప్రముఖ ఆస్పత్రుల వైద్యులు, నిపుణులతో కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం సమావేశం జరిపింది.

దేశంలో వేగంగా పెరుగుతున్న ‘H3N2’ కేసులపై సమీక్షించారు. ఇదిలా ఉండగానే, కాన్పూర్‌లోని హల్లెట్ ఆస్పత్రిలో బుధవారం ఒకే రోజు ‘H3N2’ లక్షణాలతో 200 కేసులు వచ్చాయి. ఇందులో 50 మంది బాధితులు తీవ్రంగా ఇబ్బందితో ఆస్పత్రిలో చేరినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. వీరిలో ఎక్కువగా విపరీతమైన జ్వరం, దగ్గు, శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల ఎదుట భారీగా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ఈ లక్షణాలతో ఉన్న కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని అధికారులు తెలిపారు. అసలు ఇంతలా ఆందోళనలకు గురిచేస్తున్న ‘H3N2’ వైరస్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

H3N2 అంటే..?

‘H3N2’ అనేది ఒక రకమైన ఇన్‌ఫ్లుయెంజా వైరస్. దీనిని ‘ఇన్‌ఫ్లుయెంజా-ఎ’ అని పిలుస్తారు. ఇది శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్. ‘ఇన్‌ఫ్లుయెంజా-ఎ’ వైరస్‌కు చెందిన దీని సబ్‌వేరియంట్ 1968లో మానవునిలో గుర్తించారు. ఈ వైరస్ హేమాగ్లుటినిన్ (HA), న్యూరామినిడేస్ (NA) ప్రోటీన్ జాతుల నుండి వచ్చింది. ఈ రెండు ప్రోటీన్ జాతులు 39 సబ్ టైప్‌లను కలిగి ఉంటాయి. HAలో H1 నుంచి H18 వరకు, NAలో N1 నుంచి N11వరకు ఉప రకాలు ఉంటాయి. ఇన్‌ఫ్లుయెంజా-ఎ వైరస్‌లోని రెండు ప్రోటీన్ జాతుల కలయికతో ఏర్పడేదే H3N2.

లక్షణాలు..

ఈ వైరస్ సోకినవారిలో దగ్గు, ముక్కు కారటం/ముక్కు దిబ్బడ, గొంతు మంట, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, చలి, అలసట, డయేరియా(నీళ్ల విరేచనాలు), వాంతులు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తలు..

ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ అయినా సోకకుండా ఉండాలంటే, టీకాలు వేసుకోవాలి. చుట్టు పక్కల పరిసరాలను శానిటైజ్ చేయాలి. చేతులను సబ్బుతో తరచూ కడుక్కోవాలి. వైరల్ ఫీవర్ బారినపడిన వ్యక్తిని నేరుగా తాకకూడదు. వారితో మాస్కు ధరించి మాట్లాడాలి. దగ్గు, ముక్కు కారడం వంటి సమస్యలు మీకున్నా మాస్కు పెట్టుకోవాలి.

చికిత్స ఏంటి..?

H3N2 వైరస్‌ చికిత్స అంత కష్టమేమీ కాదు. ఈ వైరస్ బారినపడిన బాధితులు తమను తాము హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. ద్రవాలను (కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు..) ఎక్కువగా తీసుకోవాలి. జ్వరం, దగ్గు, తలనొప్పి నివారణకు వైద్యుల సూచనమేరకు మందులు వాడాలి. ఇన్‌ఫ్లుయెంజా వైరస్ నివారణకు ఏటా వ్యాక్సిన్ తీసుకోవాలి. లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

Next Story

Most Viewed