పండుగ వేళ 10 మంది గుండెపోటుతో మృతి!

by Disha Web Desk 16 |
పండుగ వేళ 10 మంది గుండెపోటుతో మృతి!
X

అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా మొదలైన నవరాత్రి వేడుకల్లో విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. గుజరాత్‌లో గార్బా నృత్యం చేస్తూ 24 గంటల వ్యవధిలో 10 మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. వారిలో బరోడాకు చెందిన 13 ఏళ్ల బాలుడితో పాటు అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు, కాపడ్వాంజ్‌కు చెందిన 17 ఏళ్లు కుర్రాడు కూడా ఉన్నారు. నృత్యం చేస్తున్న సమయంలో కుప్పకూలినపుడు గుండెపోటుతో మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాపడ్వాంజ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడని స్థానిక వైద్యుడు డా ఆయుష్ పటేల్ చెప్పారు.

గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. నవరాత్రుల మొదటి ఆరు రోజుల్లో 108 అంబులెన్స్ సేవల కోసం అత్యవసర కాల్స్ సంఖ్య అత్యధికంగా ఉండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి 521 కాల్స్, శ్వాస సంబంధిత సమస్య ఉందంటూ 609 కాల్స్ వచ్చాయి. ఈ కాల్స్ ఎక్కువగా సాయంత్రం 6, తెల్లవారుజామున 2 గంటల మధ్య వచ్చాయని అధికారులు చెబుతున్నారు. కాగా, గార్బా నృత్యాన్ని నవరాత్రి సమయంలో చేస్తారు. గుజరాత్‌లో తొమ్మిది రోజులూ దుర్గాదేవిని ప్రసన్నం చేస్తూ మహిళలు, పురుషులు అర్దరాత్రి వరకు నృత్యం చేస్తారు. ఇదే సమయంలో చాలామంది కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు, ఉపవాసాలు ఉంటారు.


Next Story

Most Viewed