30 న అఖిలపక్ష సమావేశం.. బడ్జెట్ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం

by Disha Web Desk 17 |
30 న అఖిలపక్ష సమావేశం.. బడ్జెట్ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
X

న్యూఢిల్లీ: ఈ నెల 31 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిల‌పక్ష సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ నెల 30న అన్ని పార్టీల నేతలతో సమావేశాల గురించి చర్చించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి తెలిపారు. పార్లమెంట్‌లో సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్రం కోరనుంది. మరోవైపు విపక్షాలు పలు ఆందోళనకర అంశాలపై చర్చకు కేంద్రాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆర్థిక అజెండాతో ఈ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి.

ఈ నెల 31న ఇరు సభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరుసటి రోజు ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. వచ్చే నెల 13 వరకు మొదటి విడత జరగనుండగా, మార్చి 13 నుంచి ఏప్రిల్ 16 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.


Next Story

Most Viewed