మరాఠాలకు గుడ్ న్యూస్: ప్రభుత్వానికి నివేదికను అందజేసిన కమిషన్

by Dishanational2 |
మరాఠాలకు గుడ్ న్యూస్: ప్రభుత్వానికి నివేదికను అందజేసిన కమిషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: మరాఠాల సామాజిక ఆర్థిక పరిస్థితులపై మహారాష్ట్ర రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ తన నివేదికను శుక్రవారం సీఎం ఏక్‌నాథ్ షిండేకు అందజేసింది. ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో.. కమిషన్ చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ సునీల్ షుక్రే సీఎంకు నివేదికను సమర్పించారు. ఈ నెల 20న నిర్వహించే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రిపోర్టులోని వివరాలను వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామని సీఎం షిండే తెలిపారు. రాజ్యాంగానికి అనుగుణంగానే మరాఠా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. మరాఠాలకు శాశ్వత రిజర్వేషన్లు కల్పించగలమన్న నమ్మకం ఉందని దీమా వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని, షుక్రే కమిటీ నివేదిక ఆధారంగా దీనిని ముందుకు తీసుకెళ్తామని తేల్చి చెప్పారు.

ఆరో రోజుకు చేరుకున్న జరాంగే దీక్ష

మరాఠా రిజర్వేషన్లకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మరాఠా కోటా ఉద్యమ నాయకులు మనోజ్ జరాంగే జల్నా జిల్లాలోని అంతర్వాలి సారతి గ్రామంలో చేస్తున్న నిరాహార దీక్ష శుక్రవారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బలహీనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకోసుకోవడం గమనార్హం. కాగా, మరాఠా కమ్యూనిటీకి ఓబీసీ కేటగిరీ కింద రిజర్వేషన్లు కల్పించాలని, మరాఠాలందరికీ కుంబీ సర్టిఫికెట్లు ఇవ్వాలని, పీజీ వరకు ఉచిత విద్యతో పాటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలని మరాఠాలు డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed