ప్రాణాలు కబళిస్తున్న భూతాపం..

by Disha Web Desk 13 |
ప్రాణాలు కబళిస్తున్న భూతాపం..
X

న్యూఢిల్లీ: ఒకవైపు కరువు.. మరోవైపు వరదలు.. ఇంకోవైపు వడగాడ్పులు.. ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరిగిన కాలుష్యంతో ఉష్ణోగ్రత ఏడాదికి దాదాపు 2 డిగ్రీలు పెరిగి వాతావరణం ఊహకందని రీతిలో మార్పు చెందుతోంది. వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు మండుతున్నాయి. చల్లగా ఉండాల్సిన సమయంలో వడగాడ్పులు ఠారెత్తిస్తున్నాయి. వేడి వాతావరణం వీచాల్సిన సమయంలో వరదలు ముంచెత్తుతున్నాయి. అనూహ్య వాతావరణ మార్పులకు తట్టుకోలేక వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల మనుగడే ప్రశ్నార్ధకమవుతోంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గతేడాది గ్లోబల్ వార్మింగ్ పై విడుదల చేసిన వార్షిక నివేదిక ఆందోళన కలిగిస్తోంది.

ఆ నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి కాలుష్యాలు అపరిమితంగా పెరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా తలెత్తిన భూతాపానికి గతేడాది ఐరోపాలో కనీసం 15,700 మంది మృత్యువాత పడ్డారు. భూతాపానికి గతేడాది ప్రపంచ ఉష్ణోగ్రత సగటున 1.15 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. ఆఫ్రికాలో భారీ కరువు, పాకిస్తాన్ లో రికార్డు స్థాయి వర్షపాతం, చైనా, ఐరోపాల్లో వడగాల్పులు కోట్లాది మందిని ఇబ్బందులకు గురి చేశాయి. భారత్ లో గతేడాది నిర్ణీత సమయాని కంటే ముందుగా ప్రారంభమైన రుతుపవనాలు ఆలస్యంగా ముగిశాయి. దీంతో ముంచెత్తిన వరదలతో ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు, కొండ చరియలు విరిగి పడి 700 మందికి పైగా చనిపోయారు.

పిడుగుపాటుకు మరో 900 మంది మరణించారు. లక్షలాది ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. మరోవైపు చైనా, ఐరోపా దేశాల్లో వడగాడ్పుల వల్ల వేలాది మంది మృత్యువాత పడ్డారు. గతేడాది జులైలో సంభవించిన అసాధారణ వడగాల్పులకు స్పెయిన్ లో 4,600 మంది, జర్మనీలో 4,500 మంది, యూకేలో 2,800 మంది, ఫ్రాన్స్ లో 2,800 మంది, పోర్చుగల్ లో వెయ్యి మంది మరణించారు. మరోవైపు తగ్గిన ధాన్యం దిగుబడితో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగి ఆకలి చావులు కూడా సంభవించాయి.


Next Story

Most Viewed