హెచ్ 1బీ వీసాదారులకు భారీ ఉపశమనం.. యూఎస్‌సీఐఎస్ తాజా మార్గదర్శకాలు

by Gopi |
హెచ్ 1బీ వీసాదారులకు భారీ ఉపశమనం.. యూఎస్‌సీఐఎస్ తాజా మార్గదర్శకాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థిక మాంద్య పరిస్థితులు ఆ దేశ దిగ్గజ కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. దాన్నుంచి బయటపడేందుకు, ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, టెస్లా సహా అనేక కంపెనీలు పెద్ద ఎత్తున లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ పరిణామాల కారణంగా ఆ దేశంలో ఉన్న చాలామంది ఉద్యోగులు స్వదేశాలకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదని భావిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఐటీ నిపుణుల్లో 30 నుంచి 40 శాతం మంది భారతీయులేనని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్ 1బీ వీసా ఉన్న టెకీలకు అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ(యూఎస్సీఐఎస్) శుభవార్త అందించింది. ఉద్యోగాలను కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. తద్వారా 60 రోజుల గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా వారు అమెరికాలో ఉండేందుకు అవకాశం లభించింది.

మార్గదర్శకాల ప్రకారం..

* నాన్-ఇమ్మిగ్రెంట్ స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

* స్టేటస్‌లో మార్పుల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు

* ఉద్యోగులు ఒక ఏడాది ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) కోసం దరఖాస్తును ఫైల్ చేయవచ్చు

* కంపెనీ మారేందుకు పిటిషన్ దాఖలు చేసి లబ్ది పొందవచ్చు.

60 రోజుల గ్రేస్ పీరియడ్‌లోపు వీటిలో దేన్నైనా ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల హెచ్ 1బీ వీసా ఉన్నవారు నాన్-ఇమ్మిగ్రెంట్ స్టేటస్ కోల్పోయినప్పటికీ అధికారికంగా అమెరికాలో కొనసాగేందుకు వీలవుతుంది. అదేవిధంగా అర్హత ఉన్న హెచ్ 1బీ నాన్-ఇమ్మిగ్రెంట్‌లు కొత్త హెచ్ 1బీ పిటిషన్ దాఖలు చేసిన వెంటనే వేరే కంపెనీలో పనిచేయవచ్చు. అలాగే, 180 రోజుల స్టేటస్ పెండింగ్ గడువు అనంతరం స్టేటస్ అప్లికేషన్‌ను కొత్త కంపెనీ జాబ్ ఆఫర్ కింద సర్దుబాటు చేయవచ్చు.

Next Story

Most Viewed