రాజకీయాలకు మాజీ సీఎం గుడ్‌బై..ఆ టికెట్ దక్కక పోవడంతో అసంతృప్తి

by Dishanational2 |
రాజకీయాలకు మాజీ సీఎం గుడ్‌బై..ఆ టికెట్ దక్కక పోవడంతో అసంతృప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత సదానంద గౌడ గురువారం ప్రకటించారు. బెంగళూరు నార్త్ లోక్ సభ సెగ్మంట్ నుంచి పోటీచేయడానికి పార్టీ టికెట్ నిరాకరించడంతో అసంతృప్తికి గురైనట్టు తెలిపారు. పార్టీ వ్యవహరించిన తీరుపట్ల బాధగా ఉన్నట్టు వెల్లడించారు. పార్టీని ప్రక్షాళన చేయడానికి చాలా మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు చేపట్టిన వ్యక్తుల తీరు సరిగా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, మళ్లీ ఆయన ప్రధాని కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ లో చేరతారా అనే ప్రశ్నకు బదిలిస్తూ.. కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా తనకు ఆహ్వానం అందిదని, కానీ హస్తం పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. బీజేపీ బెంగళూరు నార్త్ నియోజకవర్గం నుంచి కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజేను బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలోనే సదానంద గౌడ అసంతృప్తికి లోనయ్యారు. కాగా, 1953 మార్చి 18న జన్మించిన సదానంద గౌడ బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుడు. కర్ణాటక 14వ ముఖ్యమంత్రిగా 2011 నుంచి 2013 వరకు బాధ్యతలు నిర్వహించారు. మోడీ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగానూ పని చేశారు. 2006లో కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

Next Story

Most Viewed