కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన జైశంకర్, అశ్విని వైష్ణవ్

by Shamantha N |
కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన జైశంకర్, అశ్విని వైష్ణవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రధాని మోడీతో సహా 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా.. మంగళవారం విదేశాంగమంత్రిగా డాక్టర్ ఎస్. జైశంకర్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో విదేశాంగ మంత్రిగా ఆయన వరుసగా రెండోసారి బాధ్యతలు తీసుకున్నారు. ఇక రైల్వే, ఐటీ, సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా ఢిల్లీ రైల్‌ భవన్‌లో అశ్వినీ వైష్ణవ్‌ బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ శాఖ సహాయ మంత్రిగా కీర్తి వర్ధన్‌ కూడా బాధ్యతలు స్వీకరించారు. జౌళీ పరిశ్రమ శాఖ మంత్రిగా గిరిరాజ్‌ సింగ్‌, టెక్స్‌టైల్స్‌ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పబిత్రా మార్గెరిటా బాధ్యతలు చేపట్టారు. గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖ మంత్రిగా మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా సురేశ్‌ గోపీ బాధ్యతలు స్వీకరించారు.

విదేశాంగమంత్రిగా జైశంకర్

విదేశాంగ మంత్రిగా భాద్యతలు స్వీకరించిన తర్వాత డాక్టర్‌ ఎస్‌.జైశంకర్‌ మాట్లాడారు. మరోసారి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గర్వకారణం అని పేర్కొన్నారు. గతసారి జీ20కి అధ్యక్షత వహించామని గుర్తుచేశారు. వ్యాక్సిన్ మైత్రి సరఫరాతో సహా కొవిడ్ సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి వంటి ముఖ్య కార్యక్రమాలను చేపట్టామన్నారు. మెరుగైన పాస్ పోర్టు సేవలు, విదేశాల్లోని భారతీయులకు కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ సపోర్టు ఇచ్చామన్నారు.

రైల్వేమంత్రిగా అశ్విని వైష్ణవ్

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ బాధ్యతలు స్వీకరించేందుకు మంత్రివర్గానికి చేరుకోగా, అక్కడి ఉద్యోగులు ఆయనకు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కల్పించారని అన్నారు. ఇందులో రైల్వేలది కీలకపాత్ర అన్నారు. పదేళ్లలో రైల్వేల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. కొత్త ట్రాక్ పనులు జరిగాయని, రైల్వేలపై మోడీ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed