నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం.. గురుపత్వంత్ సింగ్ హెచ్చరిక

by Disha Web Desk 17 |
నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం.. గురుపత్వంత్ సింగ్ హెచ్చరిక
X

అహ్మదాబాద్‌: కెనడాలో ఉంటున్న ఖలిస్థాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ బరితెగించాడు. ఇండియాలో జరగనున్న క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ను ‘వరల్డ్‌ టెర్రర్‌ కప్‌’గా మారుస్తానంటూ భారత్‌కు హెచ్చరికలు చేశాడు. ఇటీవల కెనడాలో జరిగిన ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్యకు ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు ఖలీస్థాన్‌ మద్దతుదారులు భారత్‌కు చేరుకున్నారని చెప్పాడు. ఈమేరకు వ్యాఖ్యలతో గురుపత్వంత్‌ సింగ్‌ మాట్లాడిన ప్రీ రికార్డింగ్‌ ఆడియో కాల్‌ ఒకటి మనదేశంలోని పలువురి ఫోన్లకు వచ్చింది.

ఈ విషయాన్ని పలువురు గుజరాత్‌ వ్యక్తులు స్థానిక పోలీసులకు తెలియజేశారు. అప్రమత్తమైన గుజరాత్‌ పోలీసులు.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అక్టోబర్‌ 5న గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వరల్డ్‌ కప్‌ 2023 తొలి మ్యాచ్‌ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్‌-పాకిస్థాన్‌ కూడా ఇక్కడ మ్యాచ్ ఆడబోతున్నాయి.

ఈ క్రమంలోనే గుజరాత్‌లో దాడులకు పాల్పడాలని ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు పథక రచన చేస్తున్నారని భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది. కాగా, కెనడాలోని హిందువులు భారత్‌కు వెళ్లిపోవాల్సిందే అంటూ ఇంతకుముందు ఉగ్రవాది గురుపత్వంత్‌ హెచ్చరించాడు. అయినా అతడిపై కెనడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

Next Story