కేజ్రీవాల్ ఎమోషనల్.. మహిళలకు ప్రతినెలా రూ.1000

by Dishanational4 |
కేజ్రీవాల్ ఎమోషనల్.. మహిళలకు ప్రతినెలా రూ.1000
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికలు సమీపించిన వేళ ఢిల్లీలోని ఆప్ సర్కారు కీలక పథకాన్ని ప్రకటించింది. 18 ఏళ్లు పైబడిన ప్రతీ మహిళకు ప్రతినెలా రూ.1000 చొప్పున ఆర్థికసాయాన్ని అందించే ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ పథకాన్ని అనౌన్స్ చేసింది. సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి ఆతిషి.. ఈ స్కీంపై అధికారిక ప్రకటన చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఎమోషనల్ అయ్యారు. ‘‘మేం ఢిల్లీ మహిళల కోసం ఒక పెద్ద ప్రకటన చేశాం. ఇది మహిళా సాధికారత కోసం చేపట్టే ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం అవుతుంది. ఇది నాకు చాలా ఎమోషనల్ డే. నేను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఢిల్లీ ప్రజల వల్లే ఈ అవకాశం లభించింది. వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను’’ అని ఆయన చెప్పారు. చాలా సంవత్సరాలుగా ఈ స్కీంను ప్రకటించే అంశంపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. “ ప్రభుత్వ కార్యకలాపాల్లో డబ్బును ఆదా చేసి.. దాన్నే ప్రజల కోసం ఖర్చు చేస్తున్నాం. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన ప్రకటించిన సందర్భంగా ఢిల్లీ మహిళలకు నా అభినందనలు’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లోనూ తమనే గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాాగా, ఈ స్కీంకు అప్లై చేసే మహిళల వయసు 18 ఏళ్లకు పైబడి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛను పొందే వారు, ఆదాయపు పన్ను చెల్లించే మహిళలు దీనికి అర్హులు కాదు. ఢిల్లీలో ఓటర్లుగా నమోదై ఉన్న మహిళలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.

Next Story

Most Viewed