‘పోస్ట్ రైడ్’ ప్లాన్‌తో బీజేపీకి 1853 కోట్లు.. కాంగ్రెస్ చెప్పిన లెక్కలివీ

by Dishanational4 |
‘పోస్ట్ రైడ్’ ప్లాన్‌తో బీజేపీకి 1853 కోట్లు.. కాంగ్రెస్ చెప్పిన లెక్కలివీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ తరహాలో ‘పోస్ట్ రైడ్’ లంచాలను విరాళాల రూపంలో వసూలు చేసేందుకు ఎలక్టోరల్ బాండ్ల స్కీంను బీజేపీ వాడుకుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. ‘‘చందా దో.. ధందా లో.. అంటే ప్రీపెయిడ్ లంచం!! ఠేకా లో.. రిష్వత్ దో.. అంటే పోస్ట్ పెయిడ్ లంచం !! హఫ్తా వసూలీ అంటే పోస్ట్ రైడ్ లంచం!! ఫర్జీ కంపెనీ అంటే షెల్ కంపెనీలు’’ అని ఆయన వివరించారు. ఎన్నికల బాండ్ల చీకటి స్కీం ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సేకరించిన విరాళాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం జైరాం రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని ప్రధాని మోడీ చెప్పారు. కానీ తమ పార్టీ అవినీతిని చట్టబద్ధం చేసుకునేందుకు ఎన్నికల బాండ్ల స్కీంను అమల్లోకి తెచ్చారు’’ అని ఆయన విమర్శించారు. కేంద్ర సర్కారు నుంచి 179 మేజర్ కాంట్రాక్టులు, ప్రాజెక్టులకు అనుమతులు పొందిన 38 కార్పొరేట్ గ్రూపులు ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి విరాళాలు ఇచ్చాయన్నారు. ఈ కంపెనీలు రూ.3.8 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు, కాంట్రాక్టులు పొందినందుకు.. రూ.2,004 కోట్ల విరాళాలను బీజేపీకి ఇచ్చాయని జైరాం రమేష్ వివరించారు. 41 కార్పొరేట్ గ్రూపులు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి 56 దాడులను ఎదుర్కొన్నాయని.. అవన్నీ బీజేపీకి రూ.2,592 కోట్ల విరాళాలివ్వగా, అందులో రూ.1,853 కోట్లు రైడ్స్ తర్వాత ఇచ్చినవే అని ఆయన పేర్కొన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఎన్నికల బాండ్ల స్కామ్‌పై సిట్‌తో విచారణ జరిపిస్తామన్నారు. అదానీ విషయంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు పీఎం కేర్స్ ఫండ్‌‌పై సిట్‌తో దర్యాప్తు చేయిస్తామని జైరాం రమేష్ వెల్లడించారు.

Next Story

Most Viewed