ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఆరోసారి ఈడీ సమన్లు

by Dishanational4 |
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఆరోసారి ఈడీ సమన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా ఆరోసారి సమన్లు ​​జారీ చేసింది. ఫిబ్రవరి 19న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. గత ఐదు నెలల వ్యవధిలో ఈడీ జారీ చేసిన ఐదు సమన్లను కూడా కేజ్రీవాల్ దాటవేశారు. విచారణకు ఆయన హాజరుకాలేదు. ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో.. గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21 తేదీల్లో కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇచ్చింది. అయితే ఈ నోటీసులను చట్టవిరుద్ధమైనవిగా అభివర్ణించిన కేజ్రీవాల్.. విచారణకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు. సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం ద్వారా ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. లిక్కర్ స్కాం కేసులో గత వారం తాము జారీ చేసిన సమన్లను కేజ్రీవాల్ ధిక్కరించడంపై ఈడీ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ సీఎం ఉద్దేశపూర్వకంగానే సమన్లను ఉల్లంఘిస్తున్నారని, విచారణ నుంచి తప్పించుకునేందుకు కుంటి సాకులు చెబుతున్నారని ఈడీ పేర్కొంది. ఇటీవల ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఫిబ్రవరి 17న తమ ఎదుట హాజరు కావాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది.

Next Story

Most Viewed